
బడ్జెట్‌పై దుమారం: సభ్యుడు చనిపోతే ఆపరా?
బడ్జెట్‌ను యధావిధిగా ప్రవేశపెట్టాలని భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం తీరును విపక్ష పార్టీలు తప్పుపట్టాయి.
- ప్రభుత్వంపై విపక్షాల మండిపాటు.. ఖర్గే సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: సిట్టింగ్ ఎంపీ చనిపోయినప్పటికీ బడ్జెట్‌ను యధావిధిగా ప్రవేశపెట్టాలని భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం తీరును విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. ఒకవైపు సహచరుడు మరణించి ఉండగా, సభను జరపడడం, బడ్జెట్‌ను ప్రకటించడం సంప్రదాయానికి విరుద్ధమని కాంగ్రెస్, జేడీయూ, ఆర్‌ఎల్‌డీ పార్టీలు మండిపడ్డాయి. కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని దేవేగౌడ, ఆర్‌ఎల్‌డీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లు ఒక అడుగు ముందుకేసి ప్రధాని, ఆర్థిక మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
మళప్పురం(కేరళ) ఎంపీ అహ్మద్ మరణవార్తను ప్రకటించడంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని ఖర్గే అన్నారు. మళప్పురం(కేరళ) ఎంపీ అహ్మద్ మంగళవారం సభలోనే గుండెపోటుకు గురయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ఉభయసభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నతరుణంలోనే ఈ ఘటన జరిగింది. పార్లమెంట్ సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం 2:30కి కన్నుమూశారు. అయితే ఉదయం 9:30 గంటలకుగానీ ఆయన మరణవార్తను అధికారికంగా ప్రకటించలేదు.
ఎంపీ మరణవార్తపై కుట్రలు
కాంగ్రెస్ పక్షనేత ఖర్గే ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆస్పత్రిలో చేర్పించిన కొద్దిసేపటికే అహ్మద్ చనిపోయారు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలుసు. కానీ ఉద్దేశపూర్వకంగా మరణవార్త ప్రకటనను ఆలస్యం చేశారు. తద్వారా బడ్జెట్‌ను యధావిధిగా ప్రవేశపెట్టాలనేది వారి పన్నాగం’అని ఖర్గే విమర్శించారు. సీనియర్ సభ్యుడి మరణానికి సంతాపంగా సభను వాయిదావేయాలని డిమాండ్ చేశారు.
సూట్‌కేసు పట్టుకొని పరుగెత్తడం అవసరమా? మాజీ ప్రధాని
ఎంపీ మరణం నేపథ్యంలో సభ జరపాలా? వద్దా? అనేదానిపై సమాలోచనలు జరుగుతున్న తరుణంలోనే ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ సూట్‌కేసుతో రాష్ట్రపతిని కలవడాన్ని మాజీ ప్రధాని దేవేగౌడ తప్పుపట్టారు. ‘ఆర్థిక మంత్రి సూట్‌కేసు పట్టుకుని హడావిడిగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లాల్సిన అవసరంలేదు. నిజానికి బడ్జెట్ ప్రభుత్వం సంకల్పిస్తే బడ్జెట్ వాయిదా పెద్ద కష్టమేమీకాదు. హడావిడి సృష్టించడం ద్వారా బడ్జెట్ వాయిదా వేయకూడదనే తన సంకల్పాన్ని ప్రభుత్వం బయటపెట్టకుంది’అని దేవేగౌడ అన్నారు.
బడ్జెట్ వద్దు: లాలూ
ఆర్‌ఎల్‌డీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కూడా బడ్జెట్‌ను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ అహ్మద్ మృతికి లాలూ సంతాపం తెలిపారు.