
మోదీ ఆ మాట చెప్పగానే.. అక్కడ నుంచి జారుకున్నా
పనాజీ: కేంద్ర కేబినెట్లో చేరాలని ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి ఆఫర్ చేసినపుడు, కేంద్ర మంత్రి కావడం రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కు ఇష్టంలేదట. ఆ సమయంలో గోవా ముఖ్యమంత్రిగా ఉన్న పారికర్.. మోదీ ఆఫర్ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించారు. పనాజీలో జరిగిన గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ 60వ జన్మదిన వేడుకల్లో పారికర్ ఈ విషయాలను స్వయంగా చెప్పారు.
‘2014 అక్టోబర్ 26న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశాను. గోవా మైనింగ్ సమస్యలు ప్రస్తావించి, రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరగా మోదీని అంగీకరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కేంద్ర కేబినెట్లోకి మీరు ఎందుకు చేరరాదు? అన్ని నన్ను ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్ మంత్రి పదవి అంటే నాపై బాంబు వేయడం వంటిదనిపించింది. ఆలోచిస్తానని మోదీకి చెప్పి అక్కడ నుంచి జారుకున్నా. రెండు, మూడు నెలలు ఢిల్లీకి వెళ్లరాదని నిర్ణయించుకున్నా. అయితే ఐదారు రోజుల్లోనే మోదీ మళ్లీ గుర్తు చేశారు. కేంద్రానికి వెళ్లాలని నవంబర్ 6న నిర్ణయించుకున్నా. అదే నెల 8న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశా’ అని గోవా ముఖ్యమంత్రి నుంచి కేంద్ర రక్షణ మంత్రి వరకు తన ప్రయాణం గురించి పారికర్ వెల్లడించారు. పారికర్ రక్షణ మంత్రిగా వెళ్లడంతో ఆయన స్థానంలో గోవా ముఖ్యమంత్రిగా పర్సేకర్ను నియమించారు.