కూడంకుళం (తమిళనాడు): కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం సమీపంలోని ఇడినాదకరై గ్రామంలో జరిగిన బాంబు పేలుడుకు సంబంధించి, అణు ఇంధన వ్యతిరేక ఉద్యమ నేత, ‘పీపుల్స్ మూవ్‌మెంట్ అగెనైస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ’ (పీఎంఏఎన్‌ఈ) సమన్వయకర్త ఎస్.పి.ఉదయకుమార్‌పైన, ఆయన సహచరులపైన బుధవారం పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి చేరువలో మంగళవారం ఒక నాటు బాంబు పేలడంతో ఆరుగురు మరణించారు.
సంఘటనా స్థలం నుంచి పోలీసులు మరో రెండు పేలని బాంబులను స్వాధీనం చేసుకున్నారని, వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని తిరునల్వేలి ఎస్పీ విజేంద్ర బిదారి తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పీఎంఏఎన్‌ఈ సమన్వయకర్త ఉదయకుమార్, ఆయన సహచరులు పుష్పరాయన్, ముకిళన్‌లతో పాటు మరికొందరిపై భారతీయ శిక్షా స్మృతి, పేలుడు పదార్థాల నియంత్రణ చట్టాల కింద కేసులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అయితే, బాంబు పేలుడుతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఉదయకుమార్ స్పష్టం చేశారు.
‘కూడంకుళం’ వ్యతిరేక ఉద్యమ నేతపై బాంబు కేసు
Published Thu, Nov 28 2013 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
Advertisement