
రిషితేశ్వరి కేసును సీబీఐకి అప్పగించాలి
గుంటూరు కలెక్టర్, ఎస్పీలకు రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ వినతి
గుంటూరు ఈస్ట్: 'యూనివర్సిటీలో చదివే విద్యార్థినుల తల్లిదండ్రులు నాలా పిల్లల్ని కోల్పోయి బాధపడకుండా ఉండాలంటే రిషితేశ్వరి కేసుపై సమగ్ర న్యాయ విచారణ జరగాలి. ఈ కేసులో పోలీసులు హడావుడిగా చార్జిషీటు దాఖలు చేస్తున్నారనే విషయం తెలుసుకుని మరోసారి కలెక్టర్‌ను కలసి న్యాయం చేయాలని కోరడానికి వచ్చాను' అని రిషితేశ్వరి తండ్రి మురళీ కృష్ణ పేర్కొన్నారు. ఈ కేసును పోలీసుల నుంచి సీబీఐకు బదలాయించాలని ఆయన ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దం డేను కలెక్టరేట్‌లో కలసి వినతిపత్రం అందించారు. అనంతరం ఐజీ ఎన్.సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠిల ఆఫీసుల్లో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాబూరావును ఏ-1 ముద్దాయిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంతోపాటు, రిషితేశ్వరి డైరీలో రాసుకున్న విద్యార్థులపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రిషితేశ్వరి కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.