కోసేయ్... కుట్టేయ్! | cesarean cases are increasing in Chittoor | Sakshi
Sakshi News home page

కోసేయ్... కుట్టేయ్!

Published Sat, Dec 14 2013 10:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

కోసేయ్... కుట్టేయ్!

కోసేయ్... కుట్టేయ్!

ఒకప్పుడు గర్భవతులకు ఇళ్ల వద్దే సుఖ ప్రసవాలు అయ్యేవి. ఇప్పుడు వైద్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. అయితే సుఖ ప్రసవాల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. సాధారణ కాన్పు చేయడం డాక్టర్లు కష్టంగా భావిస్తున్నారు. అదే తరహాలో కాసుల కోసం కక్కుర్తి పడి తల్లి కడుపునకు కోతలు పెడుతున్నారు. ఫలితంగా మాతాశిశు మరణాలు పెరిగిపోతున్నాయి. వీటి నివారణకు ప్రభుత్వం చేపట్టిన మార్పు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది.
 
 పలమనేరు, న్యూస్‌లైన్ : జిల్లాలో సాధారణ కాన్పులు నానాటికీ తగ్గిపోతున్నాయి. అదే స్థాయిలో సిజేరియన్లు పెరుగుతున్నాయి. ఫలితం గా తల్లీబిడ్డకు ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. 
 
 జిల్లాలో 14 ఆరోగ్యశాఖ క్లస్టర్లు, వాటి పరిధిలో 95 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు జరగనప్పుడు పెద్దాస్పత్రులకు రెఫర్లు చేస్తారు. జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే 13 ఆస్పత్రులున్నాయి. ఇందులో శ్రీకాళహస్తి, పలమనేరు, కుప్పం, మదనపల్లెలో ఏరియా ఆస్పత్రులున్నాయి. ఇక్కడ అత్యవసర సమయాల్లో గర్భిణులకు సిజేరియన్లు చేసే సౌకర్యాలున్నాయి. ఈ ఆస్పత్రులకు నెలకు 1,560 వరకు డెలివరీ కేసులు రాగా అందులో సగం మందికి సిజేరియన్లే దిక్కుగా మారినట్టు రికార్డు లు చెబుతున్నాయి. 
 
 కాసుల కోసం కత్తిరించేస్తున్నారు
 కాసుల కోసం కొందరు డాక్టర్లు సిజేరియన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పలమనేరు వందపడకల ఆస్పత్రిలో ఏడాదిగా 40 మంది గర్భిణులను రెఫర్లు చేశారు. ఇందులో 25 మందికి ఆస్పత్రి బయట, మార్గ మధ్యంలో, 108 వాహనాల్లో సుఖప్రసవాలయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి జిల్లా మొత్తం మీదా ఉంది. 
 
 ప్రభుత్వాస్పత్రులకు వెళ్లితే రెఫర్లు షురూ..
 సంబంధిత ఏరియా ఆస్పత్రుల్లో పనిచేసే కొందరు డాక్టర్లకు సొంత నర్సింగ్ హోమ్‌లున్నాయి. ఒకవేళ లేకపోయినా రేఫర్ చేసిన నర్సింగ్ హోమ్‌ల నుంచి సంబంధిత డాక్టర్లకు కమీషన్లు ముడుతున్నట్టు సమాచారం. ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ కాన్పు అయ్యే పరిస్థితి కనిపించినా కాసుల కోసం రెఫర్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా తల్లి కడుపునకు కోతలు తప్పడం లేదు. 
 
 పెరుగుతున్న మాతాశిశు మరణాలు
 సిజేరియన్ల కారణంగా జిల్లాలో మాతా శిశు మరణాల శాతం పెరుగుతోంది. ప్రస్తుతం శిశు మరణాలు 1000కి 46గా ఉంది. మాతృ మరణాలు 134గా నమోదైనట్టు సమాచారం. ఈ శా తాన్ని తగ్గించేందుకు మాతాశిశు సంక్షేమ శా ఖ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. 
 
 ‘మార్పు’ లేదు
 ప్రభుత్వం మాతాశిశు మరణాలను తగ్గించాలని భావించింది. ఇందులో భాగంగా గత ఏడాది నవంబర్‌లో మార్పు (సోషియల్ బిహేవిరల్ చేంజ్ కమ్యూనికేషన్) కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తక్కువ బరువుతో జన్మించిన శిశువుల శాతాన్ని తగ్గించడం, గర్భవతుల్లో రక్త హీనత సమస్యను అధిగమించడం దీని లక్ష్యం. వైద్య, ఐకేపీ, ఐసీడీఎస్ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గర్భిణికి పోషకాహార సేవలు, ప్రమాదకర పరిస్థితుల్లో రెఫర్లు, ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు, నవజాత శిశువుల సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, తల్లీబిడ్డకు పోషకాహారం ఇందులో ముఖ్యమైనవి. అయితే ఇవేవీ క్షేత్ర స్థాయిలో అమలుకావడం లేదు. ముఖ్యంగా గర్భిణుల్లో రక్త హీనత ప్రధాన సమస్యగా మారింది. 
 
 జిల్లాలో ‘మత్తు’ డాక్టర్లు లేరు
 వైద్య విధాన ఆస్పత్రులతో పాటు ఏరియా ఆస్పత్రుల్లో మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ల కొరత ఏర్పడింది. చిత్తూరు, మదనపల్లెలలో మినహా మరెక్కడా ఈ డాక్టర్లు లేరు. సర్జన్లే అన్నీ చేసుకోవాల్సి వస్తోంది. ఇక ఆస్పత్రుల్లోని బ్లండ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు లేవు. ఫలితంగా ప్రసవనొప్పులతో వచ్చే కేసులను రెఫర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలమనేరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ వీణాకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 సిజేరియన్లు పెరగడం ఆందోళనకరమే 
 సుఖప్రసవాలు తగ్గి సిజేరియన్లు పెరగడం ఆందోళన కలిగించే అంశమే. కొందరు డాక్టర్లు అనవసరంగా సిజేరియన్లు చేస్తున్నారు. ఈ సమస్య పలమనేరు, మదనపల్లె ఆస్పత్రుల్లో ఎక్కువగా ఉంది. ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లు, వాటితో ప్రభుత్వ డాక్టర్లకు లింకులు తదితరాలపై విచారణ జరుపుతాం. మార్పు కార్యక్రమం కాస్త వెనకబడ్డ మాట నిజమే. ఈ నెల రెండో వారం నుంచి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మళ్లీ ముమ్మరం చేస్తాం.  - దశరథరామయ్య, డీఎంఅండ్‌హెచ్‌వో, చిత్తూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement