
వ్యూహాత్మక అస్త్రసన్యాసం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తన ముందున్న అత్యంత ప్రధానమైన అవకాశాలన్నింటినీ ఒక్కొక్కటిగా జారవిడుస్తోంది.
ప్రధానమైన అవకాశాలన్నింటినీ ఒక్కొక్కటిగా జారవిడుస్తున్న చంద్రబాబు
సీడబ్ల్యూసీ నిర్ణయం సమయంలోనే వ్యతిరేకించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది
కానీ ఆ నిర్ణయంపై స్పందించడానికే ఇష్టపడని వైనం..
పైపెచ్చు రాజధానికి నాలుగైదు లక్షల కోట్లు కావాలని డిమాండ్
ఇప్పుడు జీవోఎం ఏర్పాటవుతున్న సమయంలో ఢిల్లీలో దీక్ష డ్రామా
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తన ముందున్న అత్యంత ప్రధానమైన అవకాశాలన్నింటినీ ఒక్కొక్కటిగా జారవిడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ విభజన అనివార్యమన్న పరిస్థితులను సృష్టిస్తున్నప్పటికీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఇరు ప్రాంతాల్లో కేవలం తన రాజకీయ భవిష్యత్తును బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన ముందున్న అస్త్రాలన్నింటినీ క్రమపద్ధతిలో వదిలేస్తున్నారు.
దాంతో కాంగ్రెస్‌కు తన పని మరింత సులభమయ్యే మార్గాన్ని చంద్రబాబు వ్యూహాత్మకంగానే కల్పిస్తున్నారు. జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయడానికన్నా ముందే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోబోతున్నారని చంద్రబాబుకు స్పష్టమైన సంకేతాలున్నా.. అడ్డుకునే ప్రయత్నం కాదు కదా దానిపై స్పందించడానికే ఇష్టపడలేదు. సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన తర్వాత అయినా.. నిర్ణయాన్ని ప్రశ్నించి అడ్డుకుంటామనిగానీ, అసెంబ్లీ సమావేశపరిస్తే ప్రభుత్వాన్ని గద్దెదించుతామనిగానీ హెచ్చరించలేదు. అప్పుడే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బాబు డిమాండ్ చేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని రాజకీయ విశ్లేషకుల అంచనా. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి రాజకీయ సంక్షోభం సృష్టించాలని వివిధ రూపాల్లో వచ్చిన డిమాండ్‌ను ఆయన అవహేళన చేశారు.
అలా చేయకపోగా సీమాంధ్రలో రాజధాని నిర్మాణం కోసం నాలుగైదు లక్షల కోట్లు కావాలని కోరుతూ సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని సమర్థించారు. ఆ రోజు సీమాంధ్రలో ఇంకా ఉద్యమం తీవ్రరూపం దాల్చలేదని, చంద్రబాబు ఏదో తొందరపాటులో అలా మాట్లాడి ఉంటారని అనుకున్నా... సీమాంధ్రలో ఉద్యమం ఎగిసిపడుతున్న తర్వాత కూడా తన ముందున్న అస్త్రాలను సంధించడానికి బాబు సిద్ధపడలేదు. కేంద్ర మంత్రిమండలి ముందుకు తెలంగాణ నోట్ రాకముందే, నోట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలపడానికి ముందే.. అసెంబ్లీలో సమైక్యం కోసం తీర్మానం చేద్దామన్న ప్రతిపాదనను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదే అంశాన్ని కొందరు పార్టీ నేతలు ఆయన దృష్టికి తెచ్చినప్పుడు.. ‘నాకు వేరే వాళ్లు చెప్పేస్థాయికి వచ్చారా...’ అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. నిజానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం తరఫున ఆయనే ముందుకొచ్చి అసెంబ్లీ పెట్టండని డిమాండ్ చేసినా.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఇప్పటికే తీర్మానం చేసినా దాని ఫలితం వేరుగా ఉండేది. తీరా కేంద్ర మంత్రిమండలి నోట్‌కు ఆమోదముద్ర వేసిన తర్వాత న్యాయం కావాలంటూ ఢిల్లీకి వెళ్లి అక్కడ దీక్ష చేపట్టడంపై పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.
ఇరు ప్రాంతాల్లో ఓట్లు, సీట్లే లక్ష్యం!: అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యంగా ఉంచాలన్న తీర్మానం చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదిస్తే, చంద్రబాబు ప్రతిష్టకుపోయి ప్రతి విమర్శలకు దిగారు. నిజానికి చంద్రబాబే స్వయంగా ముందుకొచ్చి ఆ ప్రతిపాదన తెచ్చినా ఆయనకు అడ్డుచెప్పేవారు కూడా ఎవరూ లేరు. పైగా రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు స్వాగతించేవారు. అలా చేయకుండా సీమాంధ్రకు తీవ్ర అన్యాయం చేశారని సొంత పార్టీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు.
ఇంత జరిగిన తర్వాత నేడో రేపో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ఏర్పాటు కాబోతున్న దశలో ఢిల్లీలో దీక్షకు దిగారు. పోనీ ఆయనేమైనా సమైక్యం కోసం దీక్ష చేస్తున్నారా అంటే అదీ కాదు. న్యాయం చేయమంటూ కొత్త పల్లవి అందుకున్నారు. రాష్ట్రాన్ని విభజించాలని కోరుతూ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్ర చరిత్రలో మరువలేని అన్యాయం చేసిన చంద్రబాబు ఇప్పుడు న్యాయం జరగాలంటూ మాట్లాడంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. విభజనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపి జీవోఎం ఏర్పాటవుతున్న తరుణంలో న్యాయం చేయాలంటూ ఢిల్లీలో దీక్షకు దిగడమంటే... జీవోఎం తొందరగా ఏర్పాటు చేసి సీమాంధ్రకు చేయాల్సిన న్యాయం చేసి రాష్ట్ర విభజన ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలన్న డిమాండ్, ఎత్తుగడ కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
విభజన నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెబుతున్న కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు.. సీమాంధ్రకు న్యాయం జరగాలంటే జీవోఎం ముందు చెప్పుకోండని గత కొద్దిరోజులుగా పేర్కొంటున్నారు. దాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకునేలా ఇప్పుడు న్యాయం చేయమంటూ దీక్షకు దిగారని, అంటే ఇదంతా ఒక పథకం ప్రకారం కాంగ్రెస్, చంద్రబాబు కలిసే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. అటు తెలంగాణ ప్రాంతంలో తన కుమారుడిని పోటీ చేయించి, ఇటు సీమాంధ్ర ప్రజలకు తాను న్యాయం చేయించానని చెప్పుకుంటూ ఇరు ప్రాంతాల్లో సీట్లు, ఓట్ల లెక్కలను చంద్రబాబు పక్కాగా వేసుకున్నారని చెబుతున్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం చేసిన రోజునే అంగీకరించేది లేదని చంద్రబాబు తన నిర్ణయాన్ని చెప్పి ఉంటే తెలంగాణలో కొన్ని సీట్లు తగ్గుతాయని భయపడిన కారణంగానే నిర్ణయాన్ని సమర్థించారు. ఇప్పుడు న్యాయం పేరుతో విభజన పూర్తయిన తర్వాత సీమాంధ్రలో సీట్లపై దృష్టి పెట్టి బాబు ముందుకు సాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.