హోదా కావాలని బాబు అడగనేలేదు
⇒ వెనకబడిన ప్రాంతాలకు రాయితీలు కోరలేదు: జేపీ
⇒ ఆయన ఆర్భాటం అంతా రాజధాని కోసమే
⇒ స్పష్టంగా అడగకపోతే.. ఇచ్చేవాళ్లు ఎలా ఇస్తారు?
⇒ రెవెన్యూ లోటుపై ఇప్పటివరకూ ప్రకటించలేదు
⇒ హోదా సంజీవని కాకపోతే.. ఏది సంజీవనో వెంకయ్య, చంద్రబాబు చెప్పాలి
⇒ ప్యాకేజీతో ఆర్భాటమే తప్ప ప్రయోజనం ఉండదు
ప్రత్యేక హోదా కల్పించమని కానీ, కనీసం వెనకబడిన ప్రాంతాలకు పన్ను రాయితీలు ప్రకటించమని గానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పటివరకు కేంద్రాన్ని అడగనే లేదని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. హోదా సంజీవని కాకపోతే.. ఇంకేది సంజీవనో చెప్పాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ప్యాకేజీ పేరిట ఇచ్చే డబ్బు పాలకుల ఆర్భాటాలకే తప్ప ప్రజలకు ఉపయోగపడదన్నారు. పరిశ్రమలకు పన్ను రాయితీల వల్ల కేంద్రం మీద ఒక్క పైసా భారం కూడా పడదని, పైగా అదనపు ఆదాయం వస్తుందని విశ్లేషించారు. ప్రత్యేక హోదా పేరు లేకపోయినా, హోదా వల్ల ఒనగూడే ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..
- సాక్షి, హైదరాబాద్
రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. దాన్ని కాస్తయినా సరిదిద్దడానికి పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని ‘ప్రత్యేకహోదా’ హామీ ప్రాధాన్యం ఏమిటి?
గతాన్ని తవ్వి విభజన గురించి మాట్లాడుకోవడం అనవసరం. రాష్ట్రాన్ని కోరుకున్న తెలంగాణ ప్రజల సాకారమయింది. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉంది. కానీ ఏపీకి ఆ పరిస్థితి లేదు. ఏపీకి ప్రధానంగా రెండు సమస్యలున్నాయి. మొదటిది రెవెన్యూ లోటు. 2012-13 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం రూ. 7 వేల కోట్ల లోటు ఉంది. ఇది ఏటా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఎంత లోటు అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించడం లేదు. ఇక రెండోది వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగానే పరిశ్రమలు వచ్చాయి. ఏపీలోని 13 జిల్లాల్లో సుదీర్ఘకాలంగా పారిశ్రామికీకరణ జరగలేదు. ఫలితంగా ఉపాధి అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. రాయితీలిస్తే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి లభిస్తుంది. అందుకే ప్రత్యేక హోదాను నేనే తొలుత ప్రతిపాదించాను.
ప్రత్యేక హోదా సంజీవని కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు... హోదా కల్పించడానికి కావాల్సిన అర్హతలు ఏపీకి లేవని కేంద్ర మంత్రులు... ఇతర రాష్ట్రాలూ అడుగుతున్నాయని నేతలు సాకులు చెబుతున్నారు కదా?
మరి సంజీవని ఏదో వారినే చెప్పమనండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, యువతకు ఉపాధి లభించాలంటే ఏం చేస్తారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలి. ఒరిస్సా కూడా ప్రత్యేకహోదా అడిగితే ఇవ్వమనండి, మనకు ఎలాంటి అభ్యంతరం లేదు. మనకు ఇవ్వమని మనం అడుగుతున్నాం. సాంకేతికంగా ప్రత్యేక హోదా ప్రకటన సాధ్యం కాకపోతే.... హోదా వల్ల ఒనగూడే ప్రయోజనాలు అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఏపీకి ఐదేళ్లలో రూ.23,500 కోట్లు రెవెన్యూలోటు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం చెప్పింది. అది కరెక్టా? కాదా? సరిపోతుందా? లేదా?అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెవెన్యూ లోటు ఎంత ఉందనే విషయంలో స్పష్టమైన ప్రకటన చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ రాబడి, ఖర్చు ఎంత? లోటు ఎంత? శ్వేతపత్రం ప్రకటించాలని నేను చాలాసార్లు డిమాండ్ చేశాను. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా లోటును లెక్కగట్టి నిర్దిష్టమైన ప్రకటన చేయలేకపోయింది. అలా ఎందుకు చేయలేదో పాలకులకే తెలియాలి.
ప్యాకేజీ వస్తే సరిపోతుంది. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చంద్రబాబు, వెంకయ్య అంటున్నారు. ప్యాకేజీ న్యాయం చేయగలదా?
ఐఐటీ, ఐఐఎం, రాజధానికి సహాయం.. ఇవన్నీ విభజన చట్టంలో చెప్పినవే. అవన్నీ ఎలాగూ ఇవ్వాల్సిందే. బిహార్‌కు రూ. లక్ష కోట్లు ప్యాకేజీ ప్రకటించారు. అవన్నీ ఆ రాష్ట్రానికి ఇస్తున్నవే. ఇవ్వాల్సిన దానికి ఐదో పదో కలిపి ప్యాకేజీ అంటున్నారు. ఇవ్వాల్సిన దానికి అదనంగా ఎంత ఇచ్చినా సంతోషమే. కానీ రూ. లక్ష కోట్లు ఇస్తామంటే.. మనం బోల్తా పడకూడదు. ప్యాకేజీ పేరుతో నిధులిస్తే పాలకులు ఆర్భాటాలకు ఖర్చు పెట్టడం తప్ప ప్రజలకు అందేదేమీ ఉండదు. ప్రజలకు ఉపాధి కల్పించాలంటే పెట్టుబడులు, పరిశ్రమలు రావడం తప్ప మరో మార్గం లేదు. పన్ను రాయితీలు ఇస్తేనే పరిశ్రమలు వస్తాయి.
ప్యాకేజీనే హోదాకు ప్రత్యామ్నాయంగా చూడొచ్చా?
చేపల కూర వండిపెట్టడం కాదు.. చేపలు పట్టడం నేర్పాలి అని చైనా సామెత. ప్యాకేజీ అంటే చేపల కూర. పన్ను రాయితీలు.. చేపలు పట్టడానికి ఉపయోగపడే గాలం లాంటిది. గాలం ఇవ్వాలని అడగాలి తప్ప.. చేపలకూర వండిపెట్టమని అడగకూడదు.
పన్ను రాయితీల సాధనకు ఏం చేయాలి?
బాబు ఢిల్లీ వెళ్లి.. రాజధాని ప్రాంతానికి రాయితీలు ఇవ్వమని అడిగారే తప్ప.. రాష్ట్రానికి మొత్తం ఇవ్వమని కానీ, కనీసం వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వమని గాని అడగనే లేదు. ఇది అన్యాయం. ఆర్భాటమంతా రాజ ధాని కోసమేనా! అడిగేవారు స్పష్టంగా అడగపోతే.. ఇచ్చేవాళ్లు ఎలా ఇస్తారు? ఉపాధి కల్పన కోసం నిర్దిష్టంగా పన్ను రాయితీలు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అడిగిన సందర్భమే లేదు.
ఉపాధి కల్పించడానికి ఉపయోగపడే ప్రత్యేక హోదా(పన్ను రాయితీలు) ఇవ్వడం వల్ల కేంద్రం మీద ఎంత భారం ఉంటుంది?
ప్రత్యేక హోదా కానీ.. పేరు ఇంకేదైనా కానివ్వండి. పన్ను రాయితీలు కల్పించమని అడుగుతున్నాం. పన్ను రాయితీలు ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క పైసా భారం కూడా పడదు. కొత్త పరిశ్రమల ఏర్పాటు వల్ల అదనంగా వచ్చే పన్నులు పదేళ్ల పాటు రావు. అంతే తప్ప వస్తున్న ఆదాయానికి నష్టం లేదు. ఉపాధి పెరిగితే, ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుతుంది.
కేంద్రం సాంకేతిక కారణాలు చూపిస్తూ హోదా ప్రకటన వాయిదా వస్తే నష్టం తీవ్రంగా ఉంటుంది కదా?
రాష్ట్ర శాసనసభ అనుమతి లేకున్నా, ఒక ప్రాం త ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకుండా కేంద్రం రాష్ట్రాన్ని విభజిం చింది. పరిశ్రమలన్నీ హైదరాబాద్ పరిసరాల్లోనే ఉన్నాయని అంగీకరించింది. ఏపీలో పరి శ్రమల ఏర్పాటుకు అనుకూలంగా రాయితీలు ఇస్తామనీ ప్రకటించింది. కానీ ఇప్పుడు వెనక్కి పోతోంది. వెనకబాటుతనాన్ని ఆధారంగా చేసుకొని దేశంలో చాలా రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక రాయితీలు ఇచ్చింది. రాష్ట్రమంతా కలిపి చూస్తే వెనకబాటుతనం పెద్దగా కనిపిం చకపోవచ్చు. కానీ రాయలసీమలోని 4, ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో వెనకబాటుతనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ జిల్లాలకు ప్రత్యేక రాయితీలు వెంటనే ప్రకటించాలి. ఆ జిల్లాలో పెట్టుబడులు వస్తే.. రాష్ట్రమే అభివృద్ధి చెందుతుంది.
పన్ను రాయితీల గడువు ముగిసినా అభివృద్ధి కొనసాగుతుందా?
ఏదో పెట్టుబడి రాయితీ కింద రూ. 20 లక్షల మినహాయింపు, రవాణా రాయితీ కల్పిస్తామంటే సరిపోదు. కార్పొరేట్ ఆదాయపు పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ నూటికి నూరు శాతం మినహాయింపు ఇవ్వాలి. అలా ఇస్తే.. ఇక్కడ తయారయ్యే వస్తువు ఖరీదు కనీసం 30 శాతం తగ్గుతుంది. అంటే దేశంలో ఎక్కడైనా ఒక వస్తువును తయారు చేయడానికి 100 ఖర్చయితే, రాయితీలున్న రాష్ట్రంలో రూ.70కే తయారు చేయవచ్చు. తక్కువ ధరలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటే పరిశ్రమలు ఆటోమేటిక్‌గా వస్తాయి. పదేళ్లు రాయితీలు ఉండి పారిశ్రామికీకరణ జరిగితే.. తర్వాత అభివృద్ధి కొనసాగుతుంది.