చేయాల్సిన పనులివీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపాదిత నీటి పారుదల ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలను చైనాకు చెందిన ఇన్‌ఫ్రా కంపెనీలు పరిశీలించాయి. గురువారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో చైనా ప్రతినిధుల బృందం కరీంనగర్‌లో పర్యటించింది. జిల్లాలోని ధర్మారం మండలంలోని బసంత్‌నగర్, చొప్పదండిలోని లక్ష్మీపూర్ గ్రామాల్లో కలియతిరిగింది. ఈ సందర్భంగా వారికి గోదావరి నుంచి మిడ్‌మానేరు వరకు నీటి తరలింపు కోసం తవ్వే సొరంగ మార్గాల గురించి నీటి పారుదల శాఖ సీనియర్ ఇంజనీర్ వివరించారు.
ఆ తర్వాత హైదరాబాద్‌కు చేరుకుని మూసీపై 42 కిలో మీటర్ల మేర నిర్మించతలపెట్టిన స్కైవేల (ఆకాశ మార్గం) ప్రతిపాదిత స్థలాన్ని బృందం పరిశీలించింది. వంతెన నిర్మాణ ప్రతిపాదనలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ వివరించారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న బృందం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సమావేశమైంది. మూసీపై స్కైవేలు తక్కువ కాలంలో నిర్మిచాలని సీఎం వారికి సూచించారు.ఈ పనులకు సంబంధించి నెలలోగా నివేదిక ఇస్తామని ప్రతినిధులకు చెప్పారు. అలాగే హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్ద నిర్మించే ఆకాశ హర్మ్యాల నిర్మాణంపై కూడా వారు చర్చించారు. నిర్మాణ రంగంలో వస్తున్న నూతన మార్పులు, చైనాలో అవలంబిస్తున్న పద్ధతులను ప్రతినిధులు కేసీఆర్‌కు వివరించారు. ఒక్క రోజులోనే మూడు ఫ్లోర్ల వరకు భవనాలు నిర్మించే ‘ఫ్రీ కాస్టింగ్’ విధానం గురించి వివరించారు.
హైదరాబాద్‌లో అత్యంత ఎత్తై టవర్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని, ఇందుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని సీఎం కోరా రు. సమావేశంలో అంజు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెరైక్టర్లు యోగేష్ వా, మనోజ్ గాంధీ, రాడిక్ కన్సల్టెంట్స్ చైర్మన్ రాజ్ కుమార్, బ్రిడ్జి డిజైనింగ్ విభాగాధిపతి బీపీ సింగ్, ప్రతినిధులు మార్క్ వ్యూ, ఝాయ్, సీఎం ముఖ్య కార్యద ర్శి నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి తదితరులు పాల్గొన్నారు.