చైనా ద్వంద్వ వైఖరి.. భారత్ రియాక్షన్
చైనా ద్వంద్వ వైఖరి.. భారత్ రియాక్షన్
Published Sat, Dec 31 2016 10:05 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM
న్యూఢిల్లీ: పాకిస్తాన్కు సంబంధించిన జైషే-ఈ-మహ్మద్ అధినేతను బ్లాక్లిస్టులో పెట్టాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ పెట్టిన అభ్యర్థనను చైనా అడ్డగించింది. జైషే-ఈ-మహ్మద్ గ్రూప్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ పలు మాస్టర్ మైండ్ దాడులకు పాల్పడుతున్నారని, జనవరిలో భారత ఆర్మీ బేస్పై జరిపిన దారుణమైన దాడుల్లో అతని హస్తముందని భారత్ ఆరోపిస్తోంది. అజార్ ను బ్లాక్ లిస్టులో పెట్టడాన్ని చైనా అడ్డగించడం.. ఉగ్రవాదం పట్ల ఆ దేశం అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరికి నిదర్శనమని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. 15 దేశాల సెక్యురిటీ కౌన్సిల్ ఇప్పటికే జైషే-ఈ-మహ్మద్ను బ్లాక్ లిస్టులో పెట్టింది. కానీ అజార్ను బ్లాక్లిస్టులో పెట్టలేదు.
అయితే అజార్ను కూడా ఆ జాబితాలో చేర్చాలని కోరుతూ భారత్ తొమ్మిది నెలల కిందటే ఐక్యరాజ్యసమితిలో ఓ ప్రతిపాదనను పెట్టినట్టు విదేశీ వ్యవహారాల వికాస్ స్వరూప్ తెలిపారు. అన్ని దేశాల నుంచి పూర్తి మద్దతు వచ్చినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో ఏప్రిల్ నుంచి ఎలాంటి స్పందన తెలుపలేదని పేర్కొన్నారు.
తాజాగా తమ అభ్యర్థనను రద్దు చేసినట్టు వికాస్ చెప్పారు. టెర్రరిజం నుంచి వచ్చే పెను ప్రమాదాన్ని చైనా అర్థం చేసుకుంటుందని తాము భావించామని ఆయన అన్నారు. అయితే ఈ విషయంపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెంటనే స్పందించలేదు. ఒకవేళ ఐక్యరాజ్యసమితి సెక్యురిటీ కౌన్సిల్లో అజార్ను బ్లాక్ లిస్టులో పెడితే, గ్లోబల్గా అజార్ ప్రయాణించడాన్ని రద్దు చేయొచ్చు. ఆస్తులు కూడా ఫ్రీజ్ చేసే అవకాశముంటోంది.
Advertisement