మనసు గెలుచుకుంటారా?
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. శుక్రవారం రాత్రి మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా కీలక అణు సరఫరా బృందం (ఎన్ఎస్ జీ) అంశం చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కూడా ఆయన కలిసి భేటీ అయ్యారు. అనంతరం చైనా అధికార బృందం భారత బృందంతో సమావేశమైంది.
ఎన్ఎస్ జీలో స్థానం మిస్ కావడంతో.. చైనా సానుకూలతతోనే ఎన్ఎస్ జీలో స్థానం సంపాదిస్తామని పార్లమెంట్ లో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా ఇంతకుముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాంగ్-సుష్మాల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో చైనా, భారత్ లు పరస్పరం విభేదించుకుంటున్న అంశాలతో పాటు ఎన్ఎస్ జీ చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వాంగ్ పర్యటన సందర్భంగా ఇండియాకు ఇంకా ఎన్ఎస్ జీ తలుపులు మూసుకుపోలేదని అక్కడి పత్రిక వ్యాఖ్యానించడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దక్షిణ చైనా సముద్రంపై ఇండియా తమ ప్రతినిధిని ఎలాంటి ప్రశ్నలు వేయకూడదని కూడా పత్రిక ఆక్షేపించింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా చేపడుతున్న నిర్మాణాలను విరమించుకోవాలని అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. తీర్పుతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. నిర్మాణాలను కొనసాగిస్తామని చైనా తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.