14వేలమంది ఉద్యోగులపై వేటు?
టెక్నాలజీ దిగ్గజం సిస్కో సిస్టమ్స్ ఇంక్ భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయనుంది. నెట్వర్క్ పరికరాల తయారీలో ప్రపంచంలో దాదాపు 20 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న సిస్కో సుమారు 14,000 ఉద్యోగులను తొలగించనుందని సాంకేతిక వార్తల సైట్ సీఆర్ఎన్ రిపోర్టు చేసింది. దీనికి సంబంధించి త్వరలోనే సంస్థ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని సన్నిహితవర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ముందస్తు ఉద్యోగ విమరణ ప్యాకేజీలను ప్రకటించినట్టు తెలిపింది. సీఆర్ఎన్ నివేదించిన సమాచారం ప్రకారం సిస్కో డాటా ఎనలిటిక్స్ సాఫ్ట్ వేర్, డాటాసెంటర్ల కోసం క్లౌడ్ బేస్డ్ టూల్స్ పై పెట్టుబడులు పెడుతోంది.
కాలిఫోర్నియాకు చెందిన సిస్కో హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్-సెంట్రిక్ సంస్థగా మార్పు చెందనున్న క్రమంలో రానున్న కొద్ది వారాల్లో కోతలు ప్రకటింవచ్చని అంచనా. కాగా గత ఏప్రిల్ వరకు 70వేల మంది ఉద్యోగులను కలిగి వున్న సిస్కో ఈ వార్తలపై స్పందించడానికి నిరాకరించింది. ఇదే ఏడాది రెండు ఇతర పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ , హెచ్పీ ఇంక్, ఉద్యోగంలో కోతలను ప్రకటించిన సంగతి తెలిసిందే.