కోచింగ్ సెంటర్లపై గోపాలకృష్ణ మండిపాటు
హైదరాబాద్: కోచింగ్ సెంటర్ల వ్యవహారశైలిపై సివిల్స్ ఆలిండియా మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ మండిపడ్డారు. కోచింగ్ సెంటర్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దంటూ నిరుద్యోగులను సలహా ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘నేను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. కానీ కొన్ని కోచింగ్ సెంటర్లు కావాలనే నా పేరును వాడుకుంటున్నాయి. ఇది దారుణం. మరోసారి స్పష్టం చేస్తున్నా.. నేను సొంతగానే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యా. తెలుగు సాహిత్యం సొంతగా చదివా, జనరల్ స్టడీస్ మాత్రం బాలలతగారి దగ్గర శిక్షణపొందా. సిటీలోని పలు కోచింగ్ సెంటర్లు నా పేరును, ర్యాంకుతో ప్రకటనలు ఇస్తున్నాయి. అవి తప్పుడు ప్రకటనలు’ అని గోపాలకృష్ణ చెప్పారు.
సివిల్స్ పరీక్షలు రాయగోరే అభ్యర్థులు సొంత ప్రిపరేషన్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తే మంచిదని గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. అలా కుదరని పక్షంలో నచ్చిన కోచింగ్ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. అయితే కోచింగ్ సెంటర్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని హితవుపలికారు.