- జల విధానం తుది కసరత్తు ముగించిన సీఎం
- నీటి పారుదల శాఖ అధికారులతో సుదీర్ఘ సమీక్ష
- తెలుగులో నోట్ సిద్ధం చేయాలని సూచన
- జిల్లాలవారీగా త్వరలో ఆయకట్టు, అభివృద్ధి ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కు మేరకు వాటాలను సంపూర్ణంగా, సమర్థంగా వినియోగించుకునేలా జలవిధానం ఎలా ఉండాలన్న దానిపై కసరత్తు ముగిసింది. అసెంబ్లీలో ప్రకటించనున్న జలవిధానం పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ఆదివారం నీటి పారుదల శాఖ అధికారులతో సుదీర్ఘ సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తుది రూపునిచ్చారు. ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావుతో పాటు, ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, అన్ని ప్రాజెక్టుల సీఈలు, ఎస్‌ఈలు పాల్గొన్నారు.
రాష్ట్ర పరీవాహక పరిధిలో అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కనూ అవసరాలకు తగ్గట్టుగా నిల్వ, వినియోగం చేసుకునేలా సమగ్ర అభివృద్ధి పథకాలను పొందుపరుస్తూ ప్రజెంటేషన్‌ను సిద్ధం చేశారు. అందరూ చదువుకునేలా ఈ వివరాలను తెలుగులోనూ పొందుపరుస్తూ నోట్ తయారు చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. సాగునీటి ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రాథమ్యాలు, వాతావరణ పరిస్థితులు, సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటి మళ్లింపు, తదనుగుణంగా బ్యారేజీల నిర్మాణం తదితరాలపై చర్చించారు. దీనిపై పార్టీల్లో ఉన్న అపోహలను జలవిధానం ద్వారా తొలగిద్దామని, సమగ్ర కార్యాచరణ ప్రకటించి రైతులకు, ప్రజలకు భరోసా ఇద్దామని సీఎం పేర్కొన్నట్టు తెలుస్తోంది.
ఆ మూడే కీలకం
ముఖ్యంగా మూడు ప్రధాన ప్రాజెక్టులపై సీఎం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. పలు మార్పులు జరుగుతున్న ప్రాణహిత-చేవెళ్ల పథకంపై స్పష్టత, కొత్తగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల ప్రాముఖ్యతలపై అసెంబ్లీ వేదికగా ఆయన స్పష్టత ఇవ్వదలచారని అధికార వర్గాల సమాచారం. వీటిలో ప్రాణహిత తుది డిజైన్‌పై ఇంకా సందిగ్ధత వీడలేదు. ప్రాణహిత, ఇంద్రావతిల్లో లభ్యతగా ఉన్న 600 టీఎంసీల నీటిని వాడకంలోకి తె స్తామంటున్నా ప్రతిపాదిత ప్రాణహిత ప్రాజెక్టుకు అవసరమైన 160 టీఎంసీలను మేడిగడ్డ నుంచి తీసుకుంటారా, లేక ఇచ్ఛంపల్లి వద్ద మరో బ్యారేజీ ద్వారానా అన్నదానిపై ప్రభుత్వపరంగా స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
2019 నాటికి 60 శాతం నిర్మాణం పూర్తవాలంటే ఈ ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయింపులెలా ఉండాలి, కాళేశ్వరం కార్పోరేషన్ ఏర్పాటు ద్వారా నిధుల సమీకరణ ఎలా అనే అంశాలపై దృష్టి పెట్టారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ద్వారా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల తాగు, సాగు అవసరాలు తీర్చడం, వాటికోసం చేపట్టిన భూ సేకరణ, పునరవాసం, టెండర్ల ప్రక్రియలపై లోతుగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులకు ఏటా ఎంత ఖర్చు చేస్తారు, ఎప్పట్లోగా పూర్తి చేస్తారన్న అంశాలను అసెంబ్లీలో సీఎం వివరించే అవకాశముంది.
చెరువుల పునరుద్ధరణతో 2.2 టీఎంసీల నిల్వ
కరువును ఎదుర్కొనేందుకు నీటి పారుదల శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ కూడా సీఎం వద్ద చర్చ జరిగింది. చిన్న నీటి వనరుల పునరుద్ధరణపై అధికారులు ప్రత్యేకంగా నోట్ తయారు చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లారంటున్నారు. మిషన్ కాకతీయ ద్వారా 46,531 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యం కాగా 8,215 చెరువులకు రూ.2,586 కోట్లతో ఈ ఏడాది పాలనా అనుమతులిచ్చినట్టు అందులో పేర్కొన్నారు. 7,015 చెరువుల పనులు ఆరంభించామని, రూ.522.16 కోట్ల పనులు పూర్తయ్యాయని, వీటిలో రూ.345 కోట్ల మేర చెల్లింపులు జరిగాయని వివరించారు. 6.25 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని పొలాలకు తరలించారని, తద్వారా 2.2 టీఎంసీల నీటి నిల్వకు ఆస్కారం ఏర్పడిందని, భూగర్భ జలాల పరిస్థితి మెరుగుపడిందని సీఎంకు వివరించారు.
ప్రజెంటేషన్ రెడీ!
Published Mon, Sep 28 2015 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM
Advertisement
Advertisement