నరేంద్ర మోడీ హైదరాబాద్ గడ్డపై అడుగుపెడుతున్నారని తెలిశాకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పారు. సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణ సాధనలో ఈ ప్రాంత ఉద్యోగులు 42 రోజుల పాటు సమ్మె చేసినా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇటువైపే చూడలేదన్నారు.
సాక్షి, హైదరాబాద్ : నరేంద్ర మోడీ హైదరాబాద్ గడ్డపై అడుగుపెడుతున్నారని తెలిశాకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పారు. సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణ సాధనలో ఈ ప్రాంత ఉద్యోగులు 42 రోజుల పాటు సమ్మె చేసినా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇటువైపే చూడలేదన్నారు. వందల మంది బలిదానాలు చేసుకున్నా, తెలంగాణ ప్రాంత ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళనలు చేసినా, అనేక రకాలుగా ఇతర ఉద్యమాలు జరిగినా సోనియా స్పందించలేదని విమర్శించారు. మోడీ సభ విషయం తెలిశాకే ఈ విషయంలో కాంగ్రెస్ స్పందన వచ్చిందన్నారు.
రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ సంక్షోభం నెలకొని ఉందన్నారు. 2009 నుంచి ఒక్కొక్క పార్టీ కనుమరుగు అవుతూనే ఉన్నాయని, 2014 నాటికి ఎన్ని పార్టీలు మిగులుతాయో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. సోనియాగాంధీ డెరైక్షన్‌లో రాష్ట్రంలో ప్రాంతాలవారీగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. మోడీ నాయకత్వంలో దక్షిణాదిలో బీజేపీ మరింత బలోపేతం కాబోతుందని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు చెప్పారు. దేశ భవిష్యత్‌కు డైనమిక్ లీడర్ మోడీయేనని బండారు దత్తాత్రేయ కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగరరావు, ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి, పార్టీ నేతలు బంగారు లక్ష్మణ్ తదితరులు ప్రసంగించారు.