అవును.. మంత్రి పన్ను ఎగ్గొట్టారు!
కర్ణాటక రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి రమేష్ జర్కిహోలి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బల్కర్ ఇద్దరూ చాలా పద్ధతిగా ఆదాయపన్ను ఎగ్గొట్టారని ఆదాయపన్ను శాఖ తేల్చింది. వీళ్లిద్దరికి సంబంధించిన బ్యాంకు ఖాతాల గురించిన ఎంక్వైరీలు, సర్వేలు అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చింది. వాళ్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మరికొందరు బినామీల పేర్ల మీద ప్రాథమిక సహకార సంఘాల్లో భారీ మొత్తంలో డబ్బులు డిపాజిట్లు చేసినట్లు గుర్తించింది. ఈ మొత్తాలను ఆ తర్వాత పంచదార ఫ్యాక్టరీలలోకి మళ్లించారని చెప్పింది. అసలు ఈ భూమ్మీద లేని వ్యక్తులను కూడా షేర్‌హోల్డర్లుగా పేర్కొని, పంచదార ఫ్యాక్టరీలలో పెట్టుబడిదారులుగా చూపించారు. బోగస్ ఆస్తులను సృష్టించడం, షుగర్ ఫ్యాక్టరీలు పెట్టడం కోసం ఎక్కడా లేని కంపెనీల నుంచి డబ్బులు పెట్టుబడుల రూపంలో వచ్చినట్లు చెప్పడం లాంటివన్నీ ఉన్నాయని ఐటీ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.
అయితే, ఈ ప్రకటనలో మంత్రి పేరు గానీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పేరు గానీ ప్రస్తావించకుండా.. ఇద్దరిలో ఒకరు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలోను, మరొకరు ఒక రాజకీయ పార్టీ పదవిలోను ఉన్నారని పేర్కొంది. ఇద్దరూ షుగర్ ఫ్యాక్టరీలు పెట్టారని వివరించింది. రెండు గ్రూపుల్లోనూ అచ్చం ఒకే విధానంలో పెట్టుబడులు తీసుకొచ్చి చూపించడం ఇక్కడ అసలు విశేషం. ఇందుకు కామన్ ఎంట్రీ ప్రొవైడర్లు సాయం చేసి ఉండొచ్చని ఐటీ శాఖ అనుమానించింది.

లెక్కల్లో చూపని రూ. 162.06 కోట్ల ఆదాయం కూడా ఉన్నట్లు ఈ సోదాల్లో బయటపడింది. రూ. 41 లక్షల నగదుతో పాటు 12.8 కిలోల బంగారం, వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. భారీమొత్తంలో ఆదాయాలు వస్తున్నవారు, పెట్టుబడులు పెట్టినవాళ్లు కూడా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడంలేదు. దాంతో ఈ మొత్తం వ్యవహారంపై ఐటీ శాఖ గట్టిగా దృష్టిపెట్టంది. ఈ కేసులో బెలగావి ఎమ్మెల్యే సోదరుడు ఇన్ఫార్మర్‌గా వ్యవహరించారు.