
యూటర్న్ తీసుకున్నది కాంగ్రెస్సే : కొణతాల రామకృష్ణ
ధ్వజమెత్తిన కొణతాల రామకృష్ణ
రెండో ఎస్సార్సీ వేయాలని 2002లో సీడబ్ల్యూసీ తీర్మానం
2009 డిసెంబర్‌లో రాష్ట్ర విభజన ప్రకటన.. తర్వాత విరమణ
విభజన వల్ల సమస్యలు వస్తాయని మేం చెప్తూనే ఉన్నాం
రాష్ట్రం అల్లకల్లోలంగా మారినా పట్టించుకోని కేంద్రం
రోజుకో మాట చెబుతూ గందరగోళపరుస్తున్న నేతలు
విభజనకు మార్గం సుగమం చేస్తున్న సీఎం, చంద్రబాబు
‘సైమన్ గోబ్యాక్’లా ‘జీవోఎం గోబ్యాక్’ అని నినదించాలి
తుపాన్ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ‘యూ’టర్న్ తీసుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రాల విభజన విషయంలో రెండో ఎస్సార్సీ పెట్టాలని 2002లో సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. అందుకు అనుగుణంగానే 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే 2009 డిసెంబర్‌లో చిదంబరం ఒకేసారి యూ టర్న్ తీసుకొని రాష్ట్ర విభజన ప్రకటన చేశారు. జూలై 30న మళ్లీ సీడబ్ల్యూసీ తీర్మానం ద్వారా యూ టర్న్ తీసుకుంది’’ అని వివరించారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీనే పలుమార్లు యూ టర్న్ తీసుకొని ఇతరపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘2009లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో విభజన అంశంపై చాలా కూలంకషంగా వివరించారు. అందుకే రోశయ్య కమిటీని వేశారు. అందులో తొమ్మిది అంశాలపై క్షుణ్నంగా పరిశీలన జరగాలని చెప్పారు. అయితే వీటన్నింటినీ పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది’’ అని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు స్పష్టత లేదంటూ దిగ్విజయ్‌సింగ్ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. విభజన వల్ల రాష్ట్రంలో సమస్యలు వస్తాయని, సమైక్యంగా ఉంచాలని తమ పార్టీ చాలా స్పష్టంగా పలుమార్లు నివేదించడంతో పాటు లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
చోద్యం చూస్తున్న కేంద్రం
ఉద్యమాలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తోందని కొణతాల దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు రోజుకొక మాట చెబుతూ, ప్రజల్ని గందరగోళ పరుస్తున్నారని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ ఈనెల 3న కేంద్ర కేబినేట్ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తామని చెబుతుంటే, కేంద్రహోంమంత్రి షిండే మాత్రం అబ్బేలేదు.. జీవోఎం సిఫార్సు వచ్చాక డ్రాప్టు బిల్లు తయారుచేసి, కేబినెట్‌లో పెట్టాక రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోవడానికి పంపిస్తామని చెబుతున్నారు.
మరోవైపు ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో మాట్లాడుతూ... దీనికి కాలపరిమితి లేదంటారు. రాష్ట్ర విభజన ఎన్నికల ముందా, ఆ తర్వాతనా, ఎప్పుడనేది చెప్పలేమంటారు’’ ఇలా పూటకొక మాటతో ఢిల్లీ నేతలు ప్రజలను మరింత అయోమయానికి గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. విభజన విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోకముందే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు.
మార్గం సుగమం చేస్తున్న బాబు
విభజన మరింత వేగవంతం చేయడానికిగాను కేంద్రానికి సీఎం కిరణ్, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు పూర్తిగా సహకరిస్తున్నారని కొణతాల దుయ్యబట్టారు. బాబు దీక్ష వల్లే కేంద్రం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ఏర్పాటు చేసిందన్న ప్రచారాన్ని ఆక్షేపించారు. రాష్ట్రం విడిపోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించడానికి జీవోఎం పనిచేస్తుందని చెప్పారు. ఒక వ్యక్తిని కత్తితోనా లేక ఉరివేసి చంపాలా అనే విధంగా జీఓఎంను వేస్తే.. అది తమ ప్రతిభ అని టీడీపీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు సహకారంతోనే రాష్ట్ర విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింద ని ఆరోపించారు. రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన జీవోఎంను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సైమన్ కమిషన్ లాంటి జీఓఎంను గోబ్యాక్ అనాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రజాస్వామాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ఆనాడు బ్రిటిష్ వారు ప్రయత్నించిన మాదిరిగానే ఇప్పుడు సోనియా కనుసన్నల్లో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలను నిలువునా చీల్చే కార్యక్రమం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విలేకరుల సమావేశాలకే సీఎం పరిమితం
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏదో భరోసా ఇస్తున్నట్లుగా వారానికి ఒకసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారే తప్ప విభజనను ఆపేందుకు ఏవిధమైన చర్యలు తీసుకోవడంలేదని కొణతాల విమర్శించారు. ఆయన మాట్లాడిన ప్రతిసారీ కేంద్రం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోందని గుర్తుచేశారు. ప్రజల కోసం తన పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి గడిచిన నాలుగేళ్లుగా ఎంత దారుణంగా పరిపాలన చేశారో అందరికీ తెలిసిందేనన్నారు.
సుమారు రూ.32వేల కోట్లు విద్యుత్‌చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం వేశారని, ఆర్టీసీ చార్జీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104 ఇలా సంక్షేమ పథకాలన్నింటినీ నీరుగార్చారని దుయ్యబట్టారు. రెండు గంటలు కూడా విద్యుత్ ఇవ్వలేకపోయినా తాను ప్రజల కోసమే పదవిలో ఉన్నాననడం హాస్యాస్పదమన్నారు. సోనియా ఆదేశాలమేరకు పనిచేస్తున్న కిరణ్ ఇప్పటికీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తనకు ఏం హామీ ఇచ్చిందో సీఎం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విభజన తీర్మానంపై ఓటింగ్ ఉండబోదని స్వయంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
తుపాన్ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలి
ఫైలిన్ తుపాన్ వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా వెళ్లి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని కొణతాల పిలుపునిచ్చారు. అదే విధంగా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని తమ పార్టీ కోరుతోందని తెలిపారు.