371-డి అధికరణను సవరించాల్సిందే! | constitutional amendment will require to bifurcation of andhra pradesh! | Sakshi
Sakshi News home page

371-డి అధికరణను సవరించాల్సిందే!

Published Wed, Oct 30 2013 1:19 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

371-డి అధికరణను సవరించాల్సిందే! - Sakshi

371-డి అధికరణను సవరించాల్సిందే!

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ:రాష్ట్ర విభజనకు రాజ్యాంగ సవరణ తప్పనిసరని కేంద్రం తేల్చేసింది! విభజనకు అడ్డంకి కాగలదంటూ ఇటీవల అందరి నోళ్లలోనూ బాగా నలుగుతున్న రాజ్యాంగంలోని 371-డి అధికరణాన్ని సవరించక తప్పదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యతనిచ్చేందుకు ఈ అధికరణం ద్వారా 1973లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ కావడం తెలిసిందే. విభజన నేపథ్యంలో ఈ అధికరణాన్ని సవరించడంతో పాటు హైదరాబాద్ పరిధిలోని విద్య, ఉపాధి అవకాశాలు అందరికీ అందేలా చూసేందుకు అవసరమయ్యే ఇతర ‘రక్షణ’లు కల్పిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.
 
 

 

రాష్ట్ర విభజన విధివిధానాల ఖరారుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందానికి అందజేసిన నేపథ్య పత్రం (బ్యాక్‌గ్రౌండ్ నోట్)లో ఈ విషయాన్ని ప్రధానంగా పేర్కొంది. జీవోఎం లోతుగా దృష్టి సారించాల్సిన నాలుగు ప్రాథమ్య అంశాల్లో దీన్ని హోం శాఖ ప్రధానంగా చేర్చింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తున్నందున ప్రభుత్వోద్యోగాల్లో స్థానికులకు సముచితమైన రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ రెండు రాష్ట్రాల్లోనూ యథావిధిగా కొనసాగుతుంది. కాబట్టి 371-డి అధికరణాన్ని సవరించడంతో పాటు హైదరాబాద్‌లో విద్య, ఉపాధి అవకాశాల విషయమై ఇతర రక్షణ చర్యలేవైనా చేపట్టడం ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరముంది’’ అని అందులో స్పష్టంగా పేర్కొంది. మొత్తం 85 పేజీలతో కూడిన ఈ నోట్‌ను మంగళవారం హస్తినలో మీడియాకు లీక్ చేశారు.
 
 రాష్ట్ర విభజనకు సంబంధించి మొదటి నుంచీ హైదరాబాదే ప్రధాన సమస్యగా ఉన్న నేపథ్యంలో అక్కడి విద్య, ఉపాధి అవకాశాల విషయంలో చేపట్టాల్సిన ‘రక్షణ’ చర్యలపై దృష్టి సారించాల్సిందిగా జీవోఎంకు హోం శాఖ ప్రత్యేకంగా సూచించడం గమనార్హం. అలాగే విభజన అనంతరం ఏర్పడబోయే రెండు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా తదితర నదీ జలాల పంపకాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలనూ సజావుగా పర్యవేక్షించేందుకు పూర్తి అధికారాలతో కూడిన చట్టబద్ధమైన, స్వతంత్ర సాంకేతిక జల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం హోం శాఖ సిద్ధం చేసిన కేబినెట్ నోట్‌ను ఆమోదిస్తూ అక్టోబర్ 3న తీసుకున్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయం మొదలుకుని, భౌగోళికంగా, రంగాలవారీగా ఆంధ్రప్రదేశ్ స్థూల నేపథ్యం దాకా పలు అంశాలను నేపథ్య పత్రంలో హోం శాఖ సవివరంగా పొందుపరిచింది. జల వనరులు, విద్యుత్ వనరులు, హైదరాబాద్ నగరం, 371-డి అధికరణం-రాష్ట్రపతి ఉత్తర్వులు... ఈ నాలుగింటిని ప్రాథమ్యాంశాలుగా పేర్కొంది. వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టి, లోతుగా పరిశీలించాల్సిందిగా జీవోఎంను కోరింది. వీటికి సంబంధించి నేపథ్య పత్రంలో పేర్కొన్న వివరాల సారాంశం ఇలా ఉంది...
 
 అన్నింటికీ హైదరాబాదే!
 
  రాష్ట్రానికి సంబంధించినంత వరకూ హైదరాబాద్ నగరమే ఒకరకంగా గుండెకాయ
  హెచ్‌ఎండీఏ ప్రాంతం రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో 7,073 చదరపు కిలోమీటర్ల పరిధిలో, ఏకంగా 9 లోక్‌సభ, 34 అసెంబ్లీ స్థానాల్లో విస్తరించింది. రాష్ర్ట మొత్తం ఓటర్లలో 11 శాతం నగరంలోనే ఉన్నారు.
 
  2011-12లో రాష్ట్ర మొత్తం అమ్మకపు పన్ను ఆదాయం రూ.34,910 కోట్లయితే, అందులో దాదాపు 75 శాతం హైదరాబాద్ నుంచే వచ్చింది. మిగతా దాంట్లో కోస్తాంధ్ర వాటా 15 శాతం, తెలంగాణ 8 శాతం, రాయలసీమ 3 శాతం.
 
  ఉపాధి అవకాశాల దృష్ట్యా... విద్యా రంగానికి సంబంధించి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారికీ హైదరాబాద్ చాలా కీలకంగా మారింది. తమ పిల్లలు హైదరాబాద్, రంగారెడ్డిల్లోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అర్హత సాధించేందుకు అవసరమైన నాలుగేళ్ల పాఠశాల చదువు కోసం చాలామంది వారిని రాజధానికి పంపుతుంటారు. కొన్నేళ్లుగా నగరం దేశంలోనే ప్రముఖ సాఫ్ట్‌వేర్/ఐటీ హబ్‌గా కూడా అవతరించింది.
  ఇక రాష్ట్రంలో ఉన్నత విద్యకు నగరమే ఆటపట్టు. సెంట్రల్ వర్సిటీ, నిఫ్ట్, ఎన్‌ఐఆర్‌డీ, ఐఐఐటీ, ఐఎస్‌బీ వంటి పలు జాతీయ విశ్వవిద్యాలయాలు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు నగరంలో నెలకొని ఉన్నాయి
 
 ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సేవలు కూడా రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్‌లోనే నెలకొని ఉన్నాయి. 2009 గణాంకాల ప్రకారం తెలంగాణలో 17 వేల ప్రభుత్వాసుపత్రి పడకలుంటే వాటిలో ఏకంగా 6,700 నగరంలోనే ఉన్నాయి. అలాగే తెలంగాణలోని 4,000 మంది ప్రభుత్వ వైద్యుల్లో 1,400 మంది ఇక్కడే ఉన్నారు.


  వీటితో పాటు జాతీయ భద్రత రీత్యా ప్రాధాన్యమున్న 28 రక్షణ తదితర సంస్థలు నగరంలో ఉన్నాయి. మరో 40 దాకా కేంద్ర ప్రభుత్వ జాతీయ పరిశోధన, అభివృద్ధి సంస్థలు, 9 విద్యా సంస్థలున్నాయి. ఇవన్నీ దేశ నలుమూలల నుంచీ ఎంతోమందిని ఇక్కడికి రప్పిస్తున్నాయి.
 
 ...అందుకే రాష్ట్రపతి ఉత్తర్వులు
 
 ఇవి ప్రధానంగా నాన్ గెజిటెడ్ విభాగానికి చెందిన ఉద్యోగాలకు, వారితో పాటు కొన్ని నిర్దిష్ట గెజిటెడ్ విభాగాలకూ వర్తిస్తాయి. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల వంటివాటిని ఉత్తర్వుల పరిధి నుంచి మినహాయించడం జరిగింది.
 
 ఉద్యోగ నియామక నిబంధనల అమలు కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించారు
 
 కొన్ని నిర్దిష్ట ఉద్యోగాల విషయంలో హైదరాబాద్‌ను లోకల్ ఏరియాగా కూడా ప్రకటించడం జరిగింది
  ప్రత్యక్ష నియామకాల్లో స్థానికులకు రిజర్వేషన్ల శాతం ఇలా ఉంది...
 
  రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల్లోని జిల్లా క్యాడర్ లోయర్ డివిజన్ క్లర్కు పోస్టుల్లో 80 శాతం
  జోనల్ క్యాడర్ పోస్టుల్లో లోయర్ డివిజన్ క్లర్కు పై స్థాయి పోస్టుల్లో 70 శాతం
  తహసీల్దార్, ఏఈఈ, ఏజీవో, పోలీస్ ఇన్‌స్పెక్టర్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సివిల్ సర్జన్ వంటి విభాగాల్లో 60 శాతం
 
 మల్టీ జోనల్ పోస్టుల్లో 60/70 శాతం
 
 
 పోల‘వరం’పై బహు పరాక్
 
  జలయజ్ఞంలో భాగంగా కోస్తాంధ్రలోని పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి నదిపై బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పోలవరాన్ని చేపట్టారు. దీని ద్వారా గరిష్టంగా 4.36 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించడంతో పాటు 2,369.43 మిలియన్ యూనిట్ల వార్షిక విద్యుదుత్పత్తి సాధించాలన్నది లక్ష్యం. అయితే దీని నిర్మాణం వల్ల కనీసం 277 గ్రామాలు నీటి ముంపు బారిన పడనున్నాయి. వీటిలో 205 తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి! అక్కడ 44,574 కుటుంబాల్లోని 1.75 లక్షల మంది పోలవరం వల్ల నిరాశ్రయులవుతారని అంచనా. అందుకే తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాబట్టి బాధితుల పునరావాసం, జీవనోపాధి తదితరాలకు సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం చాలా ముఖ్యం. దీని సవరించిన అంచనా వ్యయం రూ.16,000 కోట్లు. ఇందుకు ప్రణాళికా సంఘం అనుమతి రావాల్సి ఉంది. ప్రాజెక్టుపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిష్కరించాల్సిందిగా కేంద్ర జల సంఘాన్ని కోరడమైంది.
 
  తెలంగాణలో 12.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.17,875 కోట్ల అంచనా వ్యయంతో ప్రాణహిత-చేవెళ్లను చేపట్టడం జరిగింది. ఈ అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుతో దీనివల్ల ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు లబ్ధి పొందుతాయి.
 
 స్వతంత్ర, సాధికార ‘జల బోర్డు’
 
 రాష్ట్రంలోని 40 పెద్ద, మధ్య తరహా, చిన్న నదులన్నింట్లో కలిపి పలు నదీ జల బోర్డులు రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటా 2,769 టీఎంసీలు. ఇందులో ప్రధానంగా గోదావరి బేసిన్ వాటా 1,480 టీఎంసీలు, కృష్ణా బేసిన్ వాటా 811 టీఎంసీలు. రాష్ట్ర విభజన అనంతరం వీటన్నింటి వ్యవహారాలను సజావుగా పర్యవేక్షించేందుకు పూర్తి అధికారాలతో కూడిన చట్టబద్ధమైన, స్వతంత్ర సాంకేతిక జల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలి.
 
 
 ఇదీ విద్యుత్ ‘శక్తి’
 
  2010 నాటికి రాష్ట్ర మొత్తం మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం 11,450 మెగావాట్లు. ఇందులో ఏపీ జెన్‌కో వాటా 8,085.86 మెగావాట్లు (4,382.5 ఎంవీ థర్మల్, 3,703.36 ఎంవీ జల విద్యుచ్ఛక్తి). ఇదిగాక కేంద్రం వాటాగా 3,084.54 మెగావాట్లు, ఉమ్మడి రంగం నుంచి 273 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందుతోంది. ప్రైవేట్ రంగం నుంచి మరో 3,217.12 మెగావాట్లు సమకూరుతోంది.
 
  మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో తెలంగాణ వాటా 4,368 మెగావాట్లు, సీమాంధ్రది 5,242 మెగావాట్లు కాగా రాయలసీమది 1,840 మెగావాట్లు
 
 జల విద్యుదుత్పత్తి తెలంగాణలో 2,427 మెగావాట్లు కాగా, రాయలసీమలో 790 మెగావాట్లు, కోస్తాంధ్రలో 355 మెగావాట్లు
 
 రాష్ట్రంలో 8.65 లక్షల కిలోమీటర్ల పొడవైన పంపిణీ-సరఫరా లైన్లున్నాయి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement