ధరల పెంపు తప్పదు రూపాయి పతనం ప్రభావం | Consumer durable cos mull another price hike | Sakshi
Sakshi News home page

ధరల పెంపు తప్పదు రూపాయి పతనం ప్రభావం

Published Thu, Sep 5 2013 2:49 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

ధరల పెంపు తప్పదు రూపాయి పతనం ప్రభావం - Sakshi

ధరల పెంపు తప్పదు రూపాయి పతనం ప్రభావం

 న్యూఢిల్లీ: రూపాయి పతనంతో కార్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. డాలర్‌తో మారకంలో రూపాయి విలువ పడిపోతుండటంతో ఉత్పత్తి వ్యయాలు పెరిగి వాహన కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం పడుతుండటంతో అవి ధరల పెంపును ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలను పెంచగా, మరికొన్ని కంపెనీలు ఆ దిశగా యోచిస్తున్నాయి. ఇక్కడ జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) వార్షిక సమావేశంలో  పాల్గొన్న కొన్ని కంపెనీల అధినేతలు ధరల పెంపుపై మాట్లాడారు. ఆ వివరాలివీ...
 
 టయోటా వడ్డింపు అక్టోబర్ నుంచి!
 రూపాయి పతనం ఇలాగే కొనసాగితే అక్టోబర్ నుంచి కార్ల ధరలను పెంచే అవకాశాలున్నాయని టయోటా కిర్లోస్కర్ డిప్యూటీ ఎండీ, సీఓఓ(మార్కెటింగ్ అండ్ కమర్షియల్) సందీప్ సింగ్ చెప్పారు. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రభావం చూపలేకపోయాయని సందీప్ పేర్కొన్నారు.
 
 ఈ నెల 10 కల్లా ఫోక్స్‌వ్యాగన్ నిర్ణయం
 రూపాయి క్షీణతతో ధరల పెంపుపై కసరత్తు చేస్తున్నామని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది.  తమ మార్జిన్లపై రూపాయి పతన ప్రభావం చాలా తీవ్రంగా ఉందని ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా ఎండీ (ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్) అర్వింద్ సక్సేనా చెప్పారు. ఈ నెల 10 కల్లా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. వ్యయాలు భరించలేం: ఫోర్డ్ రూపాయి పతన ప్రభావాన్ని తట్టుకోవడానికి కార్ల ధరలను పెంచాలని యోచిస్తున్నామని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ జోగిందర్ సింగ్ చెప్పారు. ఉత్పత్తి, రవాణా వ్యయాలు  భరించగలిగే స్థాయికి మించి పెరిగిపోయాయని అన్నారు.
 
 తోడ్పాటు అవసరమే..: మంత్రి ప్రఫుల్ పటేల్
 అమ్మకాలు కుదేలై అల్లాడుతున్న వాహన రంగానికి ప్యాకేజీ కావలసిందేనని భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ చెప్పారు. ఈ విషయమై చర్చించడానికి వాహన రంగ ప్రతినిధులను ప్రధాని మన్మోహన్, ఆర్థిక మంత్రి పి. చిదంబరం దగ్గరకు తీసుకువెళతానని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన సియామ్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
 పండుగ కళ కలే
 పండుగల సీజన్‌లో అమ్మకాలు ఏమంతగా పుంజుకోకపోవచ్చని వాహన కంపెనీలు భావిస్తున్నాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా అమ్మకాలు స్వల్పంగానే పెరుగుతాయని, గత ఏడాది పండుగ సీజన్‌లో ఉన్నట్లుగా ఉండకపోవచ్చని మహీంద్రా ప్రెసిడెంట్ పవన్ గోయెంకా చెప్పారు. సాధారణంగా పండుగల సీజన్‌లో అమ్మకాలు 20 శాతం పెరుగుతాయని, ఈ సారి మాత్రం ఆ స్థాయిలో ఉండకపోవచ్చని 8-10 శాతం వృద్ధే ఉండొచ్చని టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ ఎండీ, సీఓఓ(మార్కెటింగ్ అండ్ కమర్షియల్) సందీప్ సింగ్ చెప్పారు. ఏ ఏడాదికి ఆ ఏడాది పండుగ సీజన్ అమ్మకాలు తగ్గుతున్నాయని టాటా మోటార్స్ కార్ల్ సిమ్ పేర్కొన్నారు.
 
 మందగమనం ఉన్నా, ముందుకే
 అమ్మకాల్లేక కుదేలైన వాహన పరిశ్రమలో పలు కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికలకు కట్టుబడి ఉన్నాయి. రూ. 10 వేల కోట్ల పెట్టుబడి ప్రణాళికలను కొనసాగిస్తామని, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్(ఆటోమోటివ్) పవన్ గోయెంకా పేర్కొన్నారు. కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రదేశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్ ప్రకారమే, తమ పెట్టుబడి ప్రణాళికలు కొనసాగుతాయని టాటా మోటార్స్ పేర్కొంది. అమ్మకాలు తగ్గుతున్నప్పటికీ తమ పెట్టుబడి ప్రణాళికల్లో ఎలాంటి మార్పూ లేదని కంపెనీ ఎండీ కార్ల్ సిమ్ చెప్పారు.
 
 పారదర్శకంగా ప్రభుత్వ విధానాలు
 వృద్ధి మందగమనాన్ని తట్టుకోవటానికి రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలని వాహన కంపెనీ అధినేతలు సూచించారు. రాజకీయాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ వైఫల్యం తదితర అంశాల గురించి మాట్లాడవద్దని ఫోర్స్ మోటార్స్ చైర్మన్ అభయ్ ఫిరోదియా వ్యాఖ్యానించారు.  వాహన రంగంలో వృద్ధికి, స్థిరమైన, పారదర్శకమైన విధానాలను ప్రభుత్వం ప్రకటించాలని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సాహ్ సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement