రాష్ట్రపతి భవన్ ఎదుట యువజంట వస్త్రత్యాగం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ ఎదుట ఒక యువజంట వస్త్రత్యాగం చేసిన సంఘటన సోమవారం కలకలం రేపింది. ప్రభాత్, అనూరాధ అనే జంట రాష్ట్రపతి భవన్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని, తాము రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకోవాలనుకుంటున్నామని భద్రతా సిబ్బందికి చెప్పా రు. వారు తగిన కారణం చెప్పకపోవడంతో భద్రతా సిబ్బంది వారిని లోపలకు అనుమతించేందుకు నిరాకరించారు.
దీనికి నిరసనగా వారు అకస్మాత్తుగా దుస్తులు విప్పేసుకున్నారు. ఈ ఆకస్మిక చర్యకు నిశ్చేష్టులైన భద్రతా సిబ్బంది, హుటాహుటిన వారిచేత బలవంతంగా కొన్ని దుస్తులు తొడిగించారు. అయినప్పటికీ, జంటలోని పురుషుడు భద్రతా సిబ్బంది తనకు బలవంతంగా తొడిగిన ధోతీని విడిచేసి, పరుగులు తీశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, బలవంతంగా జీపులోకి ఎక్కించారు.
యువజంటను తొలుత పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లిన పోలీసులు, వారి ప్రవర్తన సాధారణంగా లేకపోవడంతో రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించారు. వారిని సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచి, తర్వాత తూర్పు ఢిల్లీలోని మానసిక చికిత్సా కేంద్రానికి తరలించారు.