విక్రమ్ కాల్పుల ఘటనపై దర్యాప్తు వేగవంతం: సీపీ
హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేందర్ రెడ్డి కాల్పుల ఘటన వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. రోజు తెల్లవారుజామున 3 గంటలకు కాల్పులు జరిగాయన్నారు.
ఆ సమయంలో వాచ్‌మెన్, అతని భార్య, ఇంకో పనిమనిషితో పాటుగా భార్యాభర్తలు (విక్రమ్ గౌడ్, శిఫాలీ) మాత్రమే ఉన్నారని, సంఘటన జరగటం బాధాకరమని,ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు. విక్రమ్ శరీరంపై రెండు గాయాలున్నాయని, ఎలా జరిగిందనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా వెస్ట్ జోన్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ కూడా విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. విక్రమ్ గౌడ్ నివాసంలో ఆధారాలు సేకరించామని, క్లూస్‌టీమ్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయన్నారు.
తెల్లవారుజామున పెద్దమ్మ గుడికి వెళ్లే సమయంలో కాల్పుల శబ్ధం వినిపించిందని విక్రమ్ భార్య తెలిపారని, ఆస్పత్రికి తీసుకు వచ్చిన సమయంలో విక్రమ్ స్పృహలోనే ఉన్నారని సీపీ పేర్కొన్నారు. ఏం జరిగిందనేది కొంత సమయం తర్వాత చెబుతానన్నాడని, విక్రమ్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. మొత్తం రెండు రౌండ్లు కాల్పులు జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఇక కాల్పుల సమయంలో ఫ్లోర్‌పై రక్తం పడి ఉందని, తుడిచి వేసినట్లుగా కనిపిస్తోందన్నారు. తెలియక తుడిచానని వాచ్‌మెన్ చెబుతున్నాడని సీపీ చెప్పారు. విక్రమ్ వద్ద ఎలాంటి ఆయుధం లేదని, సమీపంలోని అన్ని సీసీ ఫుటేజ్‌లు సేకరించామన్నారు. వాహనాల కదలికలను పరిశీలిస్తున్నామని, నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామన్నారు.
కాగా ఘటన జరిగి ఏడు గంటలు దాటుతున్నా....కాల్పుల కారణాలపై పోలీసులు నిర్దారణకు రాలేకపోతున్నారు. బయట వ్యక్తులే తమ వాడిపై కాల్పులు జరిపాడని...విక్రమ్‌గౌడ్ బంధువులు ఆరోపిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు. కొన్ని రోజులుగా విక్రమ్‌గౌడ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అని కూడా బంధువులు అంటున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిగితేకానీ ఏమీ చెప్పలేమంటున్నారు. అయితే ఆగంతకులే కాల్పులు జరిపారనే దాన్ని తోసిపుచ్చుతున్నారు.
ఆ మేరకు ఆధారాలు లభించనందు వల్లే పోలీసులు ఈ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాల్లో ఆగంతకులకు సంబంధించిన ఎలాంటి విజువల్స్ రికార్డు కాలేదని తెలిసింది. ఒక సమయంలో ఆత్మహత్యాకోణంపైనే పోలీసులు ఎక్కువుగా దృష్టి సారించారు. అయితే ఈ కోణంలోనూ ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆత్మహత్యాయత్నం చేసుకుంటే ఆయుధం ఏమూంది? దాన్ని ఎవరు మాయం చేశారు?. ఆత్మహత్యే అయితే దాన్ని దాచాల్సిన అవసరం బంధువులకు ఎందుకొచ్చింది? అనేది కీలకంగా మారింది.
ఇదిలా ఉంటే అసలు విక్రమ్‌గౌడ్‌కు లైసెన్స్ వెపనే లేదని పోలీసులు చెబుతున్నారు. మరి లైసెన్స్ గన్ లేకపోతే కాల్పులకు కారణమైన గన్ ఎవరిది?. విక్రమ్‌గౌడ్ అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారా? మరెవరిదైనా ఇంట్లో పెట్టుకున్నారా? ఇలా ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు కాల్పులు జరిగింది పిస్టల్‌తోనో, రివాల్వర్‌తోనూ అనేది కూడా అంతుపట్టడం లేదు. అయితే తాము అన్ని కోణాల్లో శాస్త్రీయ విచారణ చేసిన తర్వాతే ఒక నిర్ణయానికొస్తామని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.
విక్రమ్‌గౌడ్‌పై ఆగంతకులు వచ్చి కాల్పులు జరిపినట్టు చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు. బెదిరింపు కాల్స్ విక్రమ్‌కు వచ్చాయా లేదా అనేది తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. మిస్టరీగా మారిన కాల్పుల కేసులో అన్ని కోణాల్లో విచారిస్తున్నామంటున్న డీసీపీ తెలిపారు. సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేశామని, సీసీ కెమెరా, ఫోన్ కాల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.