విక్రమ్‌పై వస్తున్న కథనాలు అవాస్తవం: షిఫాలీ
హైదరాబాద్ : మాజీమంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనకు సంబంధించి విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. కాగా కాల్పుల ఘటనకు సంబంధించి తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని విక్రమ్ గౌడ్ భార్య షిఫాలీ తెలిపారు. మీడియాలో విక్రమ్‌పై వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. ఆరోజు ఏం జరిగిందో పోలీసులకు చెప్పామని, విక్రమ్‌పై ఎవరు దాడి చేశారో పోలీసులే గుర్తించాలన్నారు. తమకు మంచి చేయకపోయినా దుష్ప్రచారం చేయవద్దని షిఫాలీ విజ్ఞప్తి చేశారు. పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆమె తెలిపారు. విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని షిఫాలీ చెప్పారు.
మరోవైపు సంఘటన జరిగి 24 గంటలు దాటినప్పటికీ పోలీసులు ఎలాంటి నిర్థారణకు రాలేకపోతున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు పలుదఫాలుగా ప్రశ్నించినప్పటికీ విక్రమ్ గౌడ్ నోరు మెదపనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విక్రమ్ భార్య షిఫాలీని ఇవాళ పోలీసులు మరోసారి విచారణ చేశారు. కాగా కాల్పుల్లో మూడో వ్యక్తి ప్రమేయం లేదని నిర్ధారించిన పోలీసులు, విక్రమ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అలాగే విక్రమ్ తండ్రి ముఖేష్ గౌడ్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా 2015లోనే రెన్యువల్ ముగిసినప్పటికీ అనధికారికంగా రెండేళ్లుగా ముఖేష్ వద్దే తుపాకీ ఉన్నట్లు సమాచారం.