
నేడే ఆప్ సర్కారు బలపరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైంది. గురువారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలాన్ని నిరూపించుకోనుంది. విశ్వాస పరీక్షలో గెలుపు ఓటముల గురించి తాము ఆందోళన చెందట్లేదని, ప్రజలకోసం మంచి పనులు చేయాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు. కేజ్రీవాల్ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, జనవరి 3లోగా బలనిరూపణ చేసుకోవాలనిలెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గడువివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో తేదీనే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది.
ప్రొటెం స్పీకర్ మతీన్ అహ్మద్ పర్యవేక్షణలో బలనిరూపణ జరగనుంది. విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ప్రొటెం స్పీకర్ కూడా పాల్గొనవచ్చంటున్నారు. 70 మంది సభ్యులున్న విధానసభలో మెజారిటీ నిరూపించుకునేందుకు 36 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ పార్టీకి 28 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు చెందిన 8 మంది శాసనసభ్యులు బయటినుంచి మద్దతు ఇస్తున్నారు. జేడీ(యూ)కు చెందిన ఏకైక సభ్యుడు షోయబ్ ఇక్బాల్ కూడా సర్కారుకు మద్దతు ప్రకటించారు. బీజేపీ బలం 31. ఆ పార్టీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. సర్కారుకు తమ మద్దతు కొనసాగుతుందని, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. తమ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం లేదని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అర్విందర్‌సింగ్ లవ్లీ తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలు షురూ: ఢిల్లీ విధానసభ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ మతీన్ అహ్మద్ ఐదవ విధానసభకు ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణస్వీకారం చేశాక మిగతా శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు ప్రొటెం స్పీకర్ పదవి స్వీకరించడానికి బీజేపీ ఎమ్మెల్యే జగ్‌దీశ్ ముఖి, జేడీ(యూ) ఎమ్మెల్యే ఇక్బాల్ నిరాకరించడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్‌ను నియమించారు. కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై బీజేపీతోపాటు కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక: విశ్వాస పరీక్ష అనంతరం.. ఆప్ సర్కారుకు మరో పరీక్ష స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక రూపంలో ఎదురుకానుంది.
వీరి ఎన్నిక శుక్రవారం జరగనుంది. స్పీకర్ పదవికి జంగ్‌పురా ఎమ్మెల్యే ఎం.ఎస్.ధీర్‌ను అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు ఆప్ ప్రకటించింది. బీజేపీ జగదీశ్ ముఖిని స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశముంది. సమావేశాలు ఈ నెల 7 వరకు జరుగుతాయి. లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ 6న అసెంబ్లీనుద్దేశించి ప్రసంగిస్తారు.
కేజ్రీవాల్ ఇంటిముందు బారులు తీరిన ‘ఆమ్ ఆద్మీ’: కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు కౌశాంబిలోని ఆయన నివాసం ముందు భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ బుధవారం కూడా వైద్యుల సూచన మేరకు దాదాపుగా ఇంటికే పరిమితమయ్యారు. ఢిల్లీ వాసులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
ఆప్‌లో చేరిన ఇన్ఫోసిస్ బోర్డు మాజీ సభ్యుడు
బెంగళూరు: ఇన్ఫోసిస్ బోర్డు సభ్యుని పదవి నుంచి ఇటీవల వైదొలగిన వి.బాలకృష్ణన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆయన బుధవారం బెంగళూరులో పీటీఐతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని నిర్ధారించారు. దేశ రాజకీయాల్లో సరికొత్త విప్లవాన్ని ఆప్ తీసుకొచ్చిందని ఆయన అన్నారు.