‘హలో’... ఆన్‌లైన్లో కొనేద్దాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తిండి, బట్ట, ఇల్లు.. ఇదంతా గతం. ఇప్పుడు స్టోరీ మారింది. అన్నం లేకపోయినా సరే మొబైల్ ఫోన్ మాత్రం ఉండాలట. సెర్చ్ సైట్ జంగ్లీ.కామ్ విడుదల చేసిన గతేడాది ఆన్‌లైన్ షాపింగ్ సెర్చ్ పోకడల నివేదికను చూస్తే అర్థమయ్యేదిదే. జంగ్లీ.కామ్ వెబ్‌సైట్లో 2013లో అత్యధికంగా వెతికిన(సర్చ్) విభాగాల్లో మొబైల్ ఫోన్లదే తొలి స్థానం. సెల్‌ఫోన్లు ఏ స్థాయిలో ఆన్‌లైన్ అమ్మకాలను ప్రభావితం చేస్తున్నాయో చెప్పడానికిదే ఉదాహరణ. ఆన్‌లైన్ కస్టమర్ల రెండవ ప్రాధాన్య విభాగంలో దుస్తులు నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో పర్సనల్ కంప్యూటర్-ట్యాబ్లెట్ పీసీలు, గృహోపకరణాలు, పుస్తకాలు ఉన్నాయి.
హైదరాబాదీలకు వీడియో గేమ్‌లు...
నగరాల వారీగా జంగ్లీ.కామ్‌లో సెర్చ్ చేసినవారి సంఖ్య చూస్తే హైదరాబాద్‌ది నాల్గవ స్థానం. ప్రథమ స్థానంలో ఢిల్లీ నిలవగా, ముంబై, బెంగళూరు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చెన్నై అయిదవ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక ఉత్పత్తుల పరంగా భాగ్యనగర వాసులు ఆన్‌లైన్‌లో అధికంగా కోరుకున్నది వీడియోగేమ్‌లనైతే... ఢిల్లీ వాసులు గృహోపకరణాలు, కోల్‌కతా వాసులు పుస్తకాలు, సంగీతం, సినిమాలు, వీడియో గేమ్‌లు, చెన్నై, బెంగళూరు కస్టమర్లు మొబైల్ ఫోన్లు, దుస్తుల కోసం సెర్చ్ చేస్తున్నారు. ముంబై కస్టమర్లు మాత్రం బూట్ల కోసం వెతికారట. దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా బ్రాండెడ్ మర్చండైస్ కోసం కస్టమర్లు పోటీపడ్డారట.
తొలి అయిదు స్థానాల్లో..: వినియోగదారులు కొన్న మొబైల ఫోన్లలో 28.60 శాతం వాటాతో తొలి స్థానంలో శాంసంగ్ నిలిచింది. మైక్రోమ్యాక్స్(18.61%), సోని(9.99%), నోకియా(9.91%), ఆపిల్(5.14%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పీసీ, ట్యాబ్లెట్ల విభాగంలో లెనోవో, శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఏసూస్, హెచ్‌పి తొలి 5 స్థానాలు కైవసం చేసుకున్నాయి. గృహోపకరణాల్లో శాంసంగ్, ఎల్‌జీ, వీడియోకాన్, వర్ల్‌పూల్, ఐఎఫ్‌బీ ఉన్నాయి. వంటింటి గృహోపకరణాల్లో ఫిలిప్స్, కెంట్, యురేకా ఫోర్బ్స్, బ్లాక్ అండ్ డెకర్, మిష్‌లే బ్రాండ్లు టాప్-5లో నిలిచాయి. సౌందర్య సాధనాల విభాగంలో లాక్మే, లోరియల్, మేబెల్లిన్, వీఎల్‌సీసీ, నైరస్‌లు ముందున్నాయి.
పోల్చిన తర్వాతే కొనుగోలు..
అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఉత్పత్తుల్ని కూడా ఇక్కడి కస్టమర్లు తమ వెబ్‌సైట్లో వెతికారని జంగ్లీ.కామ్ తెలిపింది. 2012తో పోలిస్తే 2013లో కస్టమర్లు ఎక్కువ ఖరీదున్న సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, మొబైల్ యాక్సెసరీస్‌ను కొనుగోలు చేశారు. అదే చేతి వాచీల విషయంలో తక్కువ ఖరీదున్న మోడళ్లను ఎంచుకున్నారట. ఆన్‌లైన్‌లో వస్తువులను కొనే ముందు నలుగురిలో ఒక కస్టమరు ఉత్పత్తులను పోలుస్తున్నారట. ఇందుకోసం ప్రత్యేకించిన వెబ్‌సైట్లను దర్శిస్తున్నారని జంగ్లీ.కామ్ జీఎం మహేంద్ర నెరూర్కర్ తెలిపారు. చిన్న నగరాల నుంచి కూడా కస్టమర్లు పెరుగుతున్నారని చెప్పారు. కోటి మందికిపైగా ఆన్‌లైన్ కస్టమర్లు ప్రతినెల జంగ్లీ.కామ్‌ను సందర్శిస్తున్నారని కంపెనీ తెలిపింది.