కర్ణాటకలో ‘రోడ్డు పేరు మార్పు’ వివాదంపై మాజీ ప్రధాని దేవేగౌడ.. సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు.
మంగళూరు: కర్ణాటకలో ‘రోడ్డు పేరు మార్పు’ వివాదంపై మాజీ ప్రధాని దేవేగౌడ.. సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. మంగళూరు పట్టణంలోని ఓ రోడ్డుకు విజయా బ్యాంక్ మాజీ చైర్మన్, దివంగత సుందర్ రామ్‌శెట్టి పేరును ప్రతిపాదించిన కర్ణాటక ప్రభుత్వం.. ఆ మేరకు జీవో కూడా జారీ చేసింది.
అయితే ఈ నిర్ణయాన్ని కొన్ని వర్గాలు తప్పుపట్టాయి. మంగళూరులోని అంబేద్కర్ సర్కిల్ నుంచి క్యాథలిక్ క్లబ్ వరకు ఉన్న లైట్ హౌజ్ హిల్ రోడ్డు ను ‘సుందర్ రామ్ శెట్టి మార్గ్’ గా మార్చవద్దంటూ ఆ వర్గాలు నిరసనలు చేపట్టాయి. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం పేరు మార్పు ఆదేశాలను తాత్కాలికంగా నిలిపేసింది.
దీనిపై మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఓ లేఖ రాశారు. ‘అన్ని వర్గాల పురోగతి కోసం పాటుపడిన ఆయన(సుందర్ శెట్టి) విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. పేరు వెనక్కి తీసుకోలన్న మీ(ప్రభుత్వ) నిర్ణయం ఆయన్ని అవమానించినట్లే అవుతుంది’ అని దేవగౌడ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి దీనిపై త్వరగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
మొన్నామధ్యే యూపీలో మొగల్‌సరై రైల్వేస్టేషన్ పేరును దీన్ దయాల్ ఉఫాధ్యాయ్ పేరిట మార్చేందుకు సీఎం యోగి ఆదిత్యానాథ్ యత్నించటం, దానిపై అసెంబ్లీలో దుమారం రేగటం తెలిసిందే. ఆ వివాదం ఇంకా సర్దుమణగకముందే తాజాగా కర్ణాటకలోనూ పేరు వివాదం రాజుకోవడం గమనార్హం.