మంత్రి, ఎమ్మెల్యే గోడ గొడవ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తున్నారన్న విమర్శలు ఆ పార్టీ వర్గాల్లోనే వినవస్తున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో ఎప్పటి నుంచో కొనసాగుతున్న రాజకీయ వైరమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఇద్దరి మధ్య నెలకొన్న వైరం తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆ పనులు పూర్తయితే గద్దెకు నియోజకవర్గంలో పేరుప్రతిష్టలు పెరుగుతాయని, పార్టీ అధినేత చంద్రబాబు వద్ద గ్రాఫ్ పెరుగుతుందనే అభద్రతా భావంతో ఉమా ఆటంకాలు కలిగిస్తున్నారని చెబుతున్నారు. కొందరు ఇంజనీర్లు ఒక వర్గంగా ఏర్పడి ఆయన చెప్పిన పనులను.. నిబంధనలకు వ్యతిరేకమైనా నిమిషాల్లో చేసేస్తున్నారు. మరికొందరు ఇంజనీర్లు అత్యుత్సాహంతో మంత్రిని వ్యతిరేకించే నేతల పనులకు బ్రేక్‌లు వేస్తున్నారు. కృష్ణానది రిటైనింగ్‌వాల్ నిర్మాణమే ఇందుకు ఉదాహరణగా ఉంది.
కృష్ణానది వరదల సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురై ప్రజల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం బ్యారేజి దిగువన రిటైనింగ్‌వాల్ నిర్మాణం జరగకపోవడంతో ఎడమ వైపున విజయవాడలో బ్యారేజి నుంచి రామలింగేశ్వరనగర్ వరకు ఉన్న ప్రాంతం వరదకు మునిగిపోతోంది. 2009లో 11 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో నదికి అనుకున్న అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. 15 రోజులపాటు ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు.
అప్పటి ఎమ్మెల్యే యల మంచిలి రవి రిటైనింగ్ వాల్ నిర్మాణం అవసరాన్ని ప్రభుత్వానికి వివరించడంతో 2014 ఫిబ్రవరిలో రూ.104 కోట్ల విలువతో టెండర్లు ఆహ్వానించారు. అంచనాకన్నా 5.4 శాతం తక్కువ రేటుకు ఎస్‌ఈడబ్ల్యు, దీపిక కనస్ట్రక్షన్ సంస్ధ లు టెండరు దక్కించుకున్నాయి. 24 నెలల కాలపరిమితిలో రిటైనింగ్ వాల్ నిర్మిం చాలనే నిబంధన విధించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు.
అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికే 14 నెలలు
విజయవాడ ఇరిగేషన్ సర్కిల్ పరిధిలోని కేసీ డివిజన్ దీనికి సంబంధించిన పనులను ముందుకు సాగనీయలేదు. సాధారణంగా ఇంజనీరింగ్‌శాఖలో టెండర్ల ఖరారు తరువాత నెలరోజుల్లో నిర్మాణసంస్థతో ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకుని పనులు ప్రారంభించడానికి వర్క్ ఆర్డరు ఇస్తుంది. రిటైనింగ్ వాల్ విషయంలో మాత్రం 14 నెలల తరువాత (జూన్ 2015లో) ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అగ్రిమెంట్ జాప్యం వెనుక ఇంజనీర్ల సహకారం ఉందన్న ఆరోపణలున్నాయి.
అగ్రిమెంట్ కుదుర్చుకున్న తరువాత కూడా పనులు ప్రారంభించడానికి ఇంజనీరింగ్ శాఖ రీఇన్‌ఫోర్స్‌మెంట్‌కు సంబంధించి డిజైన్లు ఇవ్వలేదు. డిజైన్ల కోసం నిర్మాణసంస్థల ప్రతినిధులు ఐదునెలలుగా ఇంజనీర్లను కలుస్తున్నా ఇప్పటివరకు వాటిని తీసుకోలేక పోయారు. కేసీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కడియాల రవి ఈ డిజైన్లు ఇవ్వడంలేదని వారం రోజుల కిందట నిర్మాణసంస్థల ప్రతి నిధులు ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈకి ఫిర్యాదు చేశారు. డిజైన్లు ఇప్పించాలని కోరారు.
ఈ విషయమై కేసీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కె.రవిని ‘సాక్షి’ వివరణ కోరగా డిజైన్లు ఇచ్చామని, నిర్మాణసంస్థ పని ప్రారంభించుకోవచ్చని చెప్పారు. ఎప్పుడు ఇచ్చారంటే ఈ మధ్యనే.. అన్నారు. డిజైన్లు ఇవ్వనందునే పని ప్రారంభం కావడం లేదనే మాటలు వినవస్తున్నాయని అడగగాా అదేం లేదు.. రెండు రోజుల్లో క్లియర్‌గా వివరాలు చెబుతా.. అంటూ దాటవేశారు.