వేల కోట్లను అప్పగించిన బడా వ్యాపారి?
సూరత్: నల్లధనం నిరోధం కోసం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ మనీ లో మరో సంచలన ఘటన నమోదైంది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు అనేక ఇబ్బందులుపడుతుండగా.. గుజరాత్ కు చెందిన బడా వ్యాపారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ బడా వ్యాపారవేత్త మాత్రం ఆసక్తికరంగా స్పందించారు. భారీ సంఖ్యలో వేలకోట్ల సొమ్మును ప్రభుత్వానికి స్వాధీనం చేశారు.
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన బిల్డర్, వజ్రాల వ్యాపారి లాల్ జీ భాయ్ పటేల్ ఇపుడు వార్తల్లో నిలిచారు. రూ 500 నుంచి రూ 1000 నోట్లు రద్దు ప్రభావంతో దాదాపు రూ.6 వేల కోట్లను నగదును అధికారులకు అప్పగించారు. భూరి విరాళాలకు , స్వచ్ఛంద దాతృత్వానికి ప్రసిద్ధి చెందిన పటేల్ ఈనిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు కార్లు, ఇల్లు లాంటి విలువైన బహుమతులను అందించిన చరిత్ర కూడా పటేల్ కు ఉంది. (సూరత్ కేంద్రంగా పనిచేస్తున్న హరే కృష్ణ డైమండ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ యజమాని వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలకియా కాదు) అలాగే దాదాపు రూ.200 కోట్ల రూపాయలను బాలికా విద్యా కోసం ఆయన విరాళమిచ్చారు. కాగా కరెన్సీ బ్యాన్ ఎఫెక్ట్ తో చాలామంది నల్లధనం కుబేరులు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తుండగా, మరికొంతమంది కోట్లాది రూపాయలను గంగపాలు చేస్తున్న సంగతి తెలిసిందే.