
జనం ఓట్లేసింది జయకు.. ఆమె ఫ్యామిలీకి కాదు
- శశికళను ప్రజలు సీఎంగా అంగీకరించరు
- డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కామెంట్స్
చెన్నై: తమిళనాడు అధికార పార్టీ ఏఐఏడీఎంకేలో గంటగంటకూ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అజెండా ప్రకటించకుండా శాసనసభా పక్ష సమావేశానికి పిలుపునివ్వడంతో మొదలైన అలజడి.. శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారన్న వార్తలతో పతాకస్థాయికి చేరింది. ఎమ్మెల్యేలను చీల్చడంద్వారా సీఎం పన్నీర్ సెల్వం శశికళకు షాకిచ్చారని, జయ మేనకొడలు దీపకు కూడా కొందరు ఎమ్మెల్యేల మద్దతు ఉంన్నదని, రెండాకుల పార్టీ మూడు ముక్కలైందని.. ఆదివారం ఉదయం నుంచి రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిణామాలపై విపక్ష డీఎంకే ఘాటుగా స్పందించింది.
తమిళనాడు ప్రతిపక్షనేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె.స్టాలిన్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఏఐడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామన్న స్టాలిన్.. శశికళనుకానీ, జయలలిత ఇతర కుటుంబసభ్యులనుకానీ ముఖ్యమంత్రిగా ప్రజలు అంగీకరించరని అభిప్రాయపడ్డారు. ‘గత ఎన్నికల్లో తమిళ ప్రజలు ఓటేసింది జయలలితకేకానీ, ఆమె కుటుంబసభ్యులకు కాదు. కాబట్టి శశికళనో, మరొకరినో సీఎంగా ప్రజలు ఒప్పుకోరు’అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.