
వైట్‌హౌస్‌లో ఓ కార్యక్రమంలో ట్రంప్ నిర్వేదం
⇒ మద్దతు కూడగట్టడంలో విఫలం, బిల్లు ఉపసంహరణ
⇒ ప్రతినిధుల సభలో సొంత పార్టీ సభ్యులే తిరుగుబాటు..
⇒ ఇక దుష్పరిణామాలు తప్పవంటూ ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్ హెల్త్‌కేర్ బిల్లుకు ఎదురుదెబ్బ తగిలింది. బిల్లు ఆమోదానికి తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన బిల్లును ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని మరోసారి స్పష్టమైంది. గురువారమే బిల్లును సభలో ప్రవేశపెట్టినా తగినంత మంది సభ్యులు లేకపోవడంతో వాయిదా వేశారు. ప్రతినిధుల సభలో హెల్త్‌కేర్ బిల్లుకు కావల్సినన్ని ఓట్లు రాబట్టేందుకు శుక్రవారం ట్రంప్ తరఫున స్పీకర్ పాల్ ర్యాన్ ప్రయత్నించి విఫలమయ్యారు.
రిపబ్లికన్ పార్టీలోని కొందరు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడంతో బిల్లు ఆమోదానికి అవసరమైన 215 ఓట్లు రావడం కష్టమని తేలిపోయింది. దీంతో బిల్లు ఓడిపోతే పరాభవం తప్పదని భావించి స్పీకర్ ర్యాన్ ఓటింగ్‌ను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. ఫ్రీడమ్ కౌకస్ పేరుతో ప్రత్యేక బృందంగా ఏర్పడ్డ రిపబ్లికన్ పార్టీ చట్టసభ్యులు బిల్లుకు మద్దతు ప్రకటించేందుకు నిరాకరించారు.
మొదటి నుంచి ‘ఒబామాకేర్’ వైద్య పాలసీని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒబామాకేర్ అమెరికాకు మంచి కాదని, అధిక వ్యయం– తక్కువ లాభాలు అనేది ఆయన వాదన. అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కొత్త హెల్త్‌కేర్ పాలసీని అమలుకు ట్రంప్ సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ ఉండడంతో బిల్లు సులువుగా ఆమోదం పొందుతుందని ట్రంప్ భావించారు. అయితే ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. భారత్ లోక్‌సభ తరహాలోనే అమెరికాలో కీలకమైన ప్రతినిధుల సభలో మొత్తం 435 మంది సభ్యులున్నారు. ఇందులో రిపబ్లికన్ల సంఖ్య 235. బిల్లు ఆమోదానికి అవసరమైన 215 ఓట్లు సులువుగా పడతాయని ట్రంప్ సర్కారు అంచనా వేసింది. సొంత పార్టీలోనే చాలామంది తిరుగుబాటు చేయడంతో బిల్లు వెనక్కి తీసుకోక తప్పలేదు. భారత్‌లా కాకుండా పార్టీలకతీతంగా బిల్లుపై స్వేచ్ఛగా ఓటు వేసే వెసులుబాటు ప్రతినిధుల సభలోని చట్ట సభ్యులకుంది.
హెల్త్‌కేర్ విధానంపై ట్రంప్ సర్కారు ఓటమి వార్త తెలిసి షికాగోలోని ట్రంప్ టవర్ వద్ద సంబరాలు చేసుకుంటున్న అమెరికన్లు
ట్రంప్ అసహనం...
హెల్త్‌కేర్ బిల్లుకు మద్దతు లభించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష డెమోక్రటన్లే దీనికి కారణమన్నారు. ఒబామాకేర్ ఇకపై కూడా కొనసాగబోతోందని, ఒక్కసారిగా ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుదలను ప్రజలు చూడబోతున్నారని హెచ్చరించారు. ‘ఇందులో చేయగలిగిందేమీ లేదు. చెడు పరిణామాలు సంభవించనున్నాయి. ఏడాదిన్నరగా చెబుతూనే ఉన్నా... ఒబామాకేర్ కొనసాగితే పరిస్థితి దిగజారుతుంది.
ఈ పాలసీ ప్రీమియంలు భారీగా పెరిగి ఎవరూ దీన్ని ఉపయోగించుకోలేని దుస్థితి వస్తుంది’అని బిల్లు ఉపసంహరించాక మీడియా సమావేశంలో ట్రంప్ చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే మంచి హెల్త్‌కేర్ బిల్లును తేవడంలో రిపబ్లికన్లతో డెమోక్రటన్లు కూడా కలిసివస్తారని భావిస్తున్నానన్నారు. కేవలం పది–పదిహేను ఓట్లే తగ్గాయని, తమ బిల్లు ఎంత అద్భుతమైనదో ఇంకా చాలా మంది తెలుసుకోలేకపోతున్నారని ట్రంప్ అన్నారు. ఇక పన్ను సంస్కరణలపై దృష్టి పెడతానన్నారు.