
‘సంబరాల పేరుతో ఓవర్ యాక్షన్ వద్దు’
సంబరాల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శించొద్దని యోగి ఆదిత్యానాథ్ తన మద్దతుదారులకు సూచించారు.
లక్నో: సంబరాల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శించొద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపికైన బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యానాథ్ తన మద్దతుదారులకు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. సంబరాల పేరుతో గొడవలకు దిగేవారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వేడుకల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించమని, ఇటువంటి వారిపై పోలీసులు తక్షణమే, కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆదిత్యనాథ్ తెలిపారు.
యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టనున్న ఆయన ఈ రోజు ఉదయం డీజీపీ జావేద్ అహ్మద్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి దేవశిష్ పాంగా, లక్నో ఎస్ఎస్ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను సమీక్షించారు. కాన్షీరాం స్మృతి ఉప్‌వన్ కు వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ మధ్యాహ్నం లక్నోలోని కాన్షీరాం స్మృతి ఉప్‌వన్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.