డ్రైవర్ సూసైడ్.. 'గాలి'పై బ్లాక్‌మనీ ఆరోపణలు
కర్ణాటక ప్రభుత్వ అధికారికి చెందిన ఓ డ్రైవర్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు సంబంధించి వెలుగుచూసిన లేఖలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై డ్రైవర్ సంచలన ఆరోపణలు చేసినట్టు వార్తాసంస్త ఏఎన్‌ఐ ట్విట్టర్‌లో తెలిపింది. గాలి జనార్దన్ రెడ్డి రూ. 100 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని, ఇందుకోసం తన యాజమాని అయిన ప్రభుత్వ అధికారి 20శాతం కమిషన్ తీసుకున్నారని డ్రైవర్ రమేశ్ గౌడ తెలిపారు. ఈ విషయం తనకు తెలియడంతో మానసికంగా వేధిస్తున్నారని డ్రైవర్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.