
మద్యం మత్తులో పారిశ్రామికవేత్త కుమార్తె హల్ చల్
కేకే.నగర్: ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె మద్యం మత్తులో కారు నడిపి ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని తిరువాన్మియూరులో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేయడంతో కారు కింద పడి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చెన్నై తిరువాన్మియూరు తిరువళ్లువర్ నగర్ కామరాజ్ వీధికి చెందిన మునస్వామి అతని మిత్రుడు శరవణన్‌తో రోడ్డుపై నడచి వెళుతుండగా ఆ సమయంలో వేగంగా అదుపుతప్పిన కారు వారిని ఢీ కొంది. ఈ ప్రమాదంతో మునస్వామి మృతి చెందాడు. శరవణన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్థానికులు కారును అడ్డుకున్నారు. కారులో ముగ్గురు యువతులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. కారు నడిపిన యువతి చెట్‌పెట్‌కు చెందిన ఐశ్వర్య (25) అని తెలిసింది. ఆ కారులో నందంబాక్కం సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేస్తున్న సోనియా (23), సుష్మ (23) అనే యువతులు ఉన్నారు. ఈ ముగ్గురు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. కారు నడిపిన ఐశ్వర్య ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె అని తెలుస్తోంది. గిండి ట్రాఫిక్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.