
వరద బాధితులకు ఎంపీల్యాడ్స్
న్యూఢిల్లీ: ముంచెత్తుతున్న వానలు, వరదలతో జల దిగ్బంధంలో చిక్కుకున్న చెన్నై వాసుల పరిస్థితిపై పార్లమెంటు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడు, ముఖ్యంగా చెన్నై దాని చుట్టుపక్కల జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలపై బుధవారం పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరిగింది. బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. సంబంధిత ఆర్థిక సాయాన్ని తక్షణమే అందించాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు, వరదల పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం జరిపిన సమీక్షా సమావేశంలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, తాను పాల్గొన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు రాజ్యసభకు తెలిపారు. తమిళనాడు సీఎం జయలలితతో మంగళవారమే ప్రధాని మాట్లాడి, అవసరమైన సాయం అందించేందుకు సిద్ధమని హామీ ఇచ్చారన్నారు. తమిళనాడులో సహాయ, పునరావాస చర్యలకు తమ ఎంపీల్యాడ్స్ నిధులను అందించేందుకు రాజ్యసభ ఎంపీలు ముందుకు వచ్చారు. పలువురు ఎంపీలు స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించారు.
లోక్‌సభలో.. తమిళనాడు, ఏపీల్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావం తీవ్రంగా ఉందని, చెన్నైలో అది మరింత తీవ్రంగా ఉందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని అన్నాడీఎంకే సభ్యుడు టీవీ వెంకటేశ్ బాబు డిమాండ్ చేశారు. సహాయ పునరావాస చర్యల కోసం జాతీయ విపత్తు స్పందన నిధి(ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి రూ. 8,480 కోట్లను రాష్ట్రానికి అందించాలన్నారు. ప్రకృతి విపత్తులతో అల్లాడుతున్న పశ్చిమబెంగాల్‌కూడా ఆర్థిక సాయం అందించాలని టీఎంసీ సభ్యుడు సుదీప్ బంధోపాధ్యాయ కోరారు. తమిళనాడు ప్రజలకు పలువరు సభ్యులు సంఘీభావం ప్రకటించారు. తమిళనాడు, ఏపీల్లో భారీ వర్షాల గురించి వాతావరణ శాఖ 72 గంటల ముందే హెచ్చరికలు జారీ చేసిందని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే, వరదనీటి యాజమాన్యం, కాలువలకబ్జా వంటి వాటివల్ల వరద ప్రమాదాన్ని ముందే గుర్తించలేమన్నారు.
రాజ్యసభలో.. భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకున్న తమిళనాడు ప్రజలకు తమ ఎంపీల్యాడ్స్ నిధులను అందించాలన్న సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి ప్రతిపాదనను ఇతర సభ్యులు స్వాగతించారు. వరద బాధితుల కోసం తన ఎంపీ ల్యాడ్స్ నిధి నుంచి రూ. 50 లక్షలను బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్, ఎంపీల్యాడ్ నిధిలో కొంతభాగంతో పాటు ఒక నెల వేతనాన్ని ఆర్‌పీఐ సభ్యుడు రామ్‌దాస్ అథవాళే విరాళంగా ప్రకటించారు.భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రస్తావిస్తూ వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై ఫొటోలను తన కూతురు, మనవరాలు పంపించారని, బాధితులను కాపాడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. తమిళనాడుకు తక్షణ సాయంగా రూ. 933 కోట్లను కేంద్రం అందించిందన్నారు. సైన్యాన్ని, నౌకాదళాన్ని, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ను రంగంలోకి దింపామన్నారు. మొత్తం వరద నష్టం రూ. 8481 కోట్లుగా రాష్ట్రం అంచనా వేస్తే.. కేంద్రం కేవలం రూ. 830 కోట్లే ఇచ్చిందని కనిమొళి (డీఎంకే)అన్నారు. తమిళనాడు వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని పలువురు డిమాండ్ చేశారు.
రాహుల్ విజ్ఞప్తి.. చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో వరద సహాయ చర్యల్లో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులను ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు. అక్కడి వరద పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, సహాయ పునరావాస చర్యలను యద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ట్వీటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
షెల్జా వ్యాఖ్యలపై వివాదం...
న్యూఢిల్లీ: తన కులం కారణంగా కొన్నేళ్ల కిందట గుజరాత్‌లోని ద్వారక దేవాలయంలో వివక్షకు గురయ్యానని కాంగ్రెస్ ఎంపీ కుమారి షెల్జా చేసిన వ్యాఖ్యలు, దానిపై కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్ చేసిన విమర్శలపై బుధవారం రాజ్యసభ దద్దరిల్లింది. అసహనంపై రాజ్యసభలో సోమవారం నాటి చర్చలో షెల్జా చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం బుధవారం విరుచుకుపడింది. ద్వారకాధీశ్ గుడిలో విజిటింగ్ బుక్‌లో అక్కడి సౌకర్యాలను ప్రశంసిస్తూ షెల్జా రాసిన నోట్‌ను సభానాయకుడు జైట్లీ సభముందుంచారు. 2013లో షెల్జా గుడికి వెళ్లినప్పుడు అక్కడి సౌకర్యాలను మెచ్చుకున్నారని జైట్లీ తెలిపారు. షెల్జా మాత్రం ప్రధానమైన ద్వారకాధీశ్ ఆలయం గురించి చెప్పటం లేదని.. ‘బెట్ ద్వారక’ గుడిలో తనను కులం పేరుతో ప్రశ్నించారన్నారు.
మాట మార్చిన షెల్జా వ్యాఖ్యలను వాపసు తీసుకుని, క్షమాపణ కోరాలని అధికార పక్షం డిమాండ్ చేసింది. దీంతో వాదోపవాదాలు మిన్నంటాయి. డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభను వాయిదా వేసి అన్ని పార్టీల నేతలతో తన చాంబర్‌లో సమావేశమైనా షెల్జా వ్యవహారంపై పరిష్కారం దొరకలేదు. ఆ తరువాత సమావేశమైనప్పటికీ వాదోపవాదాలు తగ్గలేదు. షెల్జాతో సహా పలువురు నేతలు వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేయటంతో సభను డిప్యూటీ చైర్మన్ వాయిదా వేశారు.