
భాగ్యనగరం.. చెత్తమయం..
ఏడో రోజుకు చేరిన పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
పలు ప్రాంతాల్లో క్షీణించిన శుభ్రత
చార్మినార్ ప్రాంతంలో అధికారుల స్వచ్ఛహైదరాబాద్
అడ్డుకున్న కార్మికులు.. ఉద్రిక్తత
హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఏడో రోజుకు చేరుకోవడంతో రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరం చెత్త మయంగా మారింది. పలు కూడళ్లు, రహదారులు చెత్తకుప్పలతో దుర్గంధభరితంగా మారాయి. కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు స్పష్టంచేస్తున్నారు.
నేటికి(సోమవారంరోజున) కార్మికుల సమ్మె రెండో వారంలోకి చేరుకోనుంది. కాగా ఆదివారం ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతి రేకంగా దిష్టిబొమ్మలు దహనం చేసి కార్మికులు తమ నిరసన తెలిపారు. పాతనగరంలో దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి మదీనా చౌరస్తా వరకు నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
దీంతో పోలీసులు 30 మంది పారిశుధ్య కార్మికులను అదుపులోకి తీసుకొని కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసులు శాలిబండ చౌరస్తా నుంచి మక్కా మసీదు, చార్మినార్ నుంచి మదీనా చౌరస్తా వరకు రోడ్లను శుభ్రపరిచారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచే విషయంలో సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మూసారంబాగ్ చౌరస్తాలో రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాగా రహమత్‌నగర్ డివిజన్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రైవేటు మహిళలతో చెత్తను తరలిస్తుండగా.. రెగ్యులర్ పారిశుద్ధ్య సిబ్బంది వారితో గొడవకు దిగారు. కార్మికనగర్‌లో నివాసం ఉంటున్న సదరు ప్రైవేటు మహిళల చీపురు కట్టలని రెగ్యులర్ కార్మికులు తగులబెట్టడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
ప్రత్యామ్నాయంగా..
కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆదివారం జీహెచ్‌ఎంసీకి చెందిన 466 వాహనాల్లో 1815 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరో 300 స్వచ్ఛ హైదరాబాద్ యూనిట్లు నగరంలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నాయన్నారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో కార్మికులు సమ్మె విరమించాలని కోరారు.