పాక్ ప్రధానికి వ్యతిరేకంగా సుప్రీంకు ఆధారాలు!
ఇస్లామాబాద్: పనామా పత్రాల వివాదంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఉచ్చుబిగుస్తోంది. ఈ వ్యవహారంలో ఆయనకు వ్యతిరేకంగా తాజాగా మాజీ క్రికెటర్, ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టుకు ఆధారాలు సమర్పించారు. 1988 నుంచి షరీఫ్ కుటుంబం అక్రమ వ్యాపారాలు చేస్తూ, పన్ను ఎగ్గొడుతూ రూ. 14.5 కోట్ల సొమ్మును మనీలాండరింగ్ చేసిందని పత్రాలు న్యాయస్థానానికి అందజేశారు. షరీఫ్ కుటుంబానికి సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు, రుణాలను ఎగ్గొట్టిన వివరాలను తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టుకు సమర్పించిన పత్రాలను విశ్లేషించిన పాక్ పత్రిక డాన్.. 1988 నుంచి షరీఫ్ కుటుంబం పన్నులు ఎగ్గొట్టి హవాలా వ్యాపారం ద్వారా విదేశాలకు రూ. 145 మిలియన్ల సొమ్మును తరలించిందని తెలిపింది. ఈ కాలంలో షరీఫ్ కుటుంబం కేవలం రూ. 897 పన్నును మాత్రమే చెల్లించిందని పేర్కొంది. ప్రధాని షరీఫ్ ఆస్తులపై జర్నలిస్టు అసద్ ఖరాల్ రాసిన పుస్తకంలోని వివరాలను కూడా ప్రతిపక్షనేత ఇమ్రాన్‌ఖాన్ సుప్రీంకోర్టుకు సమర్పించారు.