మాజీ మోడల్కి జీవిత ఖైదు
లక్నో: తల్లిదండ్రులను హత్య చేసిన కేసులో మాజీ మోడల్ ప్రియాంక సింగ్, ఆమె స్నేహితురాలు అంజూలకు జీవిత ఖైదు విధిస్తూ మీరట్ జిల్లా జడ్జి రామకృష్ణన్ గౌతమ్ తీర్పు వెలువరించారు. అలాగే ఒకొక్కరు రూ. 20 వేల జరిమాన విధించాలని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. 2008, నవంబర్ 11న ప్రియంక... అంజూ సహాయంతో తన తల్లిదండ్రులు ప్రేమ్ వీర్ సింగ్ (65) అతడి భార్య సంతోష్ సింగ్ (62) లను కత్తితో పోడిచి దారుణంగా హత్య చేసింది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అందులోభాగంగా 17వ తేదీన ప్రియాంక, అంజూలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో పోలీసులు అనుమానించి గట్టిగా ప్రశ్నించారు. దీంతో ప్రియాంక, అంజూలు హత్య చేసినట్లు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. ఆస్తి తగాదాలతోపాటు తనను నిర్లక్ష్యం చేస్తున్నారనే కోపంతోనే ఈ హత్యకు ఒడిగట్టినట్లు వారు పోలీసుల ఎదుట చెప్పారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరిచారు. దీంతో వారికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.