పరిశ్రమలు.. నవ్వాయ్!
పరిశ్రమలు.. నవ్వాయ్!
Published Fri, Sep 13 2013 1:18 AM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి జూలైలో అనూహ్యంగా మెరుగుపడింది. సంబంధిత సూచీ (ఐఐపీ) 2.6 శాతం వృద్ధి సాధించింది. వృద్ధి రేటు క్షీణించవచ్చన్న అంచనాలకు భిన్నంగా రేటు పెరగడం విశేషం. అంతకుముందు రెండు నెలల్లో అంటే మే, జూన్‌లలో ఈ సూచీలో అసలు వృద్ధిచెందకపోగా, క్షీణత (మేలో -2.8 శాతం, జూన్‌లో 1.8 శాతం) నమోదయ్యింది. గత ఏడాది జూలైలో కూడా ఈ రేటు -0.1 శాతం పడిపోయింది. తయారీ, విద్యుత్ రంగాల మెరుగైన పనితీరు 2013 జూలైలో మొత్తం సూచీకి సానుకూల ఫలితాలను అందించింది. కేంద్ర గణాంకాల సంస్థ గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2012 జూలైతో పోలిస్తే 2013 ఇదే నెలలో పలు కీలక రంగాలు ముందడుగు వేశాయి.
కీలక రంగాల పరుగు
తయారీ: మొత్తం ఉత్పత్తిలో దాదాపు 70 శాతం వాటా కలిగిన ఈ రంగం వృద్ధి 3 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది అసలు వృద్ధి లేకపోగా తటస్థంగా నిలిచింది. తయారీ రంగంలోని మొత్తం 22 గ్రూపుల్లో 11 సానుకూల ఫలితాలను నమోదు చేసుకున్నాయి.
విద్యుత్: వృద్ధి రేటు 2.8 శాతం నుంచి 5.2 శాతానికి ఎగసింది.
మైనింగ్: ఈ రంగంలో వృద్ధిలేకపోగా మైనస్‌లోనే కొనసాగుతోంది. అయితే క్షీణత రేటు -3.5% నుంచి -2.3%కి తగ్గింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు సూచిక అయిన భారీ యంత్రపరికరాల విభాగం క్షీణబాట నుంచి వృద్ధి బాటకు మళ్లి 15.6 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే నెలలో ఇది 5.8 శాతం క్షీణతలో ఉంది. వినియోగ వస్తువులు: ఈ విభాగం వృద్ధి నుంచి క్షీణతలోకి జారింది. 0.7% వృద్ధి నుంచి -0.9 శాతం కిందకు దిగింది.
నాలుగు నెలల్లో చూస్తే నిరాశే...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో ఐఐపీ మైనస్‌లోనే వుంది. -0.2 శాతం నమోదయ్యింది. తయారీ రంగాన్ని తీసుకుంటే క్షీణత -0.6 శాతం నుంచి -0.2 శాతానికి తగ్గింది. విద్యుత్ రంగం వృద్ధి 5.5 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గింది. ఇక మైనింగ్ రంగం -3.5 శాతం నుంచి -2.3 క్షీణతను నమోదు చేసుకుంది. జూలై నెల మంచి పనితీరువల్ల క్యాపిటల్ గూడ్స్ విభాగం -16.8 శాతం నుంచి 1.8 శాతం వృద్ధికి మళ్లింది. వినియోగ వస్తువుల విభాగంలో ఉత్పత్తి క్షీణించి -2%గా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.1 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.
ముందుంది మంచికాలం: ప్రభుత్వం
తాజా గణాంకాల పట్ల ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మయారామ్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న నెలల్లో వృద్ధి మరింత పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పెట్టుబడుల క్యాబినెట్ కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ఇందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మొదటి త్రైమాసికంలో ప్రోత్సాహకరంగా ఉన్నట్లు తెలిపారు. జూన్ క్వార్టర్‌లో ఈ పరిమాణం 22 శాతం వృద్ధితో 5.39 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు వెల్లడించారు.
మరిన్ని చర్యలు అవసరం: పరిశ్రమలు
పారిశ్రామిక వృద్ధి రేటు మరింత పెరగడానికి విధాన నిర్ణేతలు మరిన్ని చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వర్గాలు విజ్ఞప్తి చేశాయి. వడ్డీరేట్ల తగ్గింపు, ఇండస్ట్రియల్ క్యారిడార్ల వంటి భారీ ప్రాజెక్టుల సత్వర అమలు తదితర సాకారాత్మక చర్యల ద్వారా వృద్ధి వేగం పుంజుకుంటుందని ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిబార్ సింగ్ పేర్కొన్నారు. వినియోగ వస్తువుల రంగం వంటి కీలక విభాగాలు పుంజుకోడానికి వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ తగ్గించాల్సి ఉంటుందని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత గణాంకాలను చూసి, రికవరీ ప్రారంభమైందని అప్పుడే చెప్పడం సాధ్యంకాదని కూడా ఆయన విశ్లేషించారు.
Advertisement
Advertisement