
త్వరలో రైతు భరోసా దీక్ష: పొంగులేటి
అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే రైతులకు అన్ని విధాలా భరోసా కల్పించేవిధంగా ప్రభుత్వంపై...
- కలెక్టరేట్ల ముట్టడి, దీక్షపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే రైతులకు అన్ని విధాలా భరోసా కల్పించేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు త్వరలో రైతు భరోసా దీక్ష చేపట్టనున్నట్లు వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రాష్ట్ర నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సమస్యలపై శుక్రవారం పార్టీ నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి, త్వరలో జరపతలపెట్టిన రైతు భరోసా దీక్ష ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రైతులు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వం ఇప్పటివరకు పైసా సహాయం కూడా చేయలేదన్నారు.
రైతులను ఆదుకోవాలని నాలుగు నెలల క్రితం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో రైతు దీక్ష చేపట్టామని, ఎవరు ఎన్ని ఆందోళనలు చేసినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం తన పంథాను మార్చుకోవడంలేదని విమర్శించారు. వివిధ రాజకీయ పార్టీలు రకరకాల ఉద్యమాలు చేపట్టినా పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడే విధంగా త్వరలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతు భరోసాదీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. రైతు సమస్యలపై అసెంబ్లీ సమావేశాలను స్తంభింపచేస్తామన్నారు. సమావేశంలో పార్టీ నేతలు ఎడ్మా కిష్టారెడ్డి, జి.సురేష్ రెడ్డి, ముజ్‌తబ అహ్మద్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కె.శివకుమార్, కొండా రాఘవరెడ్డి, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, ఐల వెంకన్నగౌడ్, నర్రా బిక్షపతి, జి. శ్రీధర్ రెడ్డి, భీష్వ రవీందర్, ఎం శ్యాంసుందర్ రెడ్డి, మెరుగు శ్రీనివాసరెడ్డి, గాదె నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.