
మళ్లీ ఎఫ్‌ఐఐల జోరు రూ. 11,000 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు
మళ్లీ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్స్‌పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. వెరసి సెప్టెంబర్ 2-22 మధ్య కాలంలో ఈక్విటీలలో నికరంగా రూ. 11,043 కోట్లను(173 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: మళ్లీ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్స్‌పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. వెరసి సెప్టెంబర్ 2-22 మధ్య కాలంలో ఈక్విటీలలో నికరంగా రూ. 11,043 కోట్లను(173 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. అయితే మరోవైపు ఇదే సమయంలో రూ. 985 కోట్ల(15.9 కోట్ల డాలర్లు) విలువైన డెట్ సెక్యూరిటీలను నికరంగా విక్రయించారు. దీంతో దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో ఎఫ్‌ఐఐల నికర పెట్టుబడులు రూ. 10,058 కోట్లకు(156 కోట్ల డాలర్లు) పరిమితమయ్యాయి.
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతలు స్వీకరించాక ఎఫ్‌ఐఐల పెట్టుబడులు పుం జుకోవడం గమనార్హం. అంతకుముందు ఆగస్ట్ నెలలో ఎఫ్‌ఐఐలు నికరంగా దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 16,000 కోట్ల(250 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. డాలరుతో మారకంలో పతనమవుతున్న రూపాయి విలువను నిలువరించేందుకు రాజన్ చేపట్టిన చర్యలు ఎఫ్‌ఐఐల పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయని నిపుణులు విశ్లేషించారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను కొనసాగించడానికి నిర్ణయించడం కూడా దీనికి జత కలిసిందని పేర్కొన్నారు. ఫలితంగా ఈ నెలలో ఇప్పటివరకూ రూపాయి విలువ 350 పైసలు(5.3%) పుంజుకుని 62.23 వద్ద నిలిచింది.