92 ఏళ్ల క్రితం నుంచి ఆనవాయితీగా కొనసాగుతూ వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్కు చరమగీతం పాడేందుకు.. సాధారణ బడ్జెట్లో విలీనం చేసే ప్రతిపాదన ప్రక్రియను పరిశీలించడం ప్రారంభించామని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ తెలిపింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని.. రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ పరిశీలన ప్రక్రియను ప్రారంభించామని ఆర్థికశాఖ కార్యదర్శి అశోక్ లావాసా తెలిపారు.రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేయాలని కోరుతూ గత నెలలోనే రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఈ ప్రతిపాదనపై లాభనష్టాలన్నింటినీ బేరీజు వేసిన అనంతరమే తాము ఓ నిర్ణయానికి రాగలుగుతామని అశోక్ లావాసా వెల్లడించారు.ఒకవేళ విలీనానికి గ్రీన్ సిగ్నల్ వస్తే ప్రస్తుతం చెల్లించే వార్షిక డివిడెంట్ నుంచి రైల్వే విమోచనం పొంది ప్రభుత్వం నుంచి స్థూల బడ్జెటరీ సపోర్టును అందకోనుంది. దీంతో కొంతమేర నష్టాలను రైల్వే అధిగమించగలుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది.
1924 నుంచి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్నుంచి విడదీసి ప్రత్యేకంగా కేటాయింపులు చేయడం జరుగుతూ వస్తోంది. అప్పట్లో మొత్తం బడ్జెట్లో 70 శాతంగా ఉన్న రైల్వే బడ్జెట్ ప్రస్తుతం 15 శాతంగా మాత్రమే ఉంటోంది. దీంతో పాటు ప్రస్తుతం రైల్వే అధిక రెవెన్యూ లోటును భరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో రెండు బడ్జెట్లను విలీనం చేసి, ఈ భారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖకు బదలాయించాలని సురేష్ ప్రభు ఈ విలీన ప్రతిపాదనను అరుణ్ జైట్లీ ముందుంచారు. రెండు బడ్జెట్ విలీన ప్రతిపాదనతో లేఖ రాసిన సురేష్ ప్రభు,అసలకే నష్టాల్లో ఉన్న రైల్వే, 7వ వేతన సంఘ సిఫారసులు వల్ల ఏర్పడే అదనపు నష్టాన్ని కూడా లేఖలో వివరించారు.