ఐఫోన్7లో కొత్తేమీ లేదట! | Five features the iPhone 7 and 7 Plus borrowed from Android | Sakshi
Sakshi News home page

ఐఫోన్7లో కొత్తేమీ లేదట!

Published Thu, Sep 8 2016 1:45 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

ఐఫోన్7లో కొత్తేమీ లేదట! - Sakshi

ఐఫోన్7లో కొత్తేమీ లేదట!

ఫుల్ హెప్ క్రియేట్ చేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నామంటూ యాపిల్ లాంచ్ చేసిన ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్లో కొత్తదనమేమి కనిపించడం లేదట. ఈ ఫోన్లో ఉన్న ప్రత్యేక ఫీచర్లన్నీ ఇప్పటికే ఆండ్రాయిడ్ వెర్షన్లో లాంచ్ అయిన స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో ఉన్నవేనని టెక్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. దానివరకు అది అప్గ్రేడెడ్గా వచ్చినా.. ఫీచర్ల పరంగా చూస్తే రూ.10 వేల నుంచి రూ.15 వేల శ్రేణిలో ఉన్న వివిధ స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో ఇవి అందుబాటులో ఉంటున్నాయని పేర్కొంటున్నారు. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్7 అరువు తెచ్చుకున్న ఐదు ప్రముఖ ఫీచర్లేమిటో ఓసారి చూద్దాం..
 
డ్యూయల్ కెమెరా :
యాపిల్ కొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్7, ఐఫోన్ 7ప్లస్లో కెమెరాపై ఎక్కువగా దృష్టిసారించినట్టు పేర్కొంది. డ్యూయల్ కెమెరాతో వినియోగదారుల ముందుకు వచ్చింది. కానీ ఆ ఫీచరేమీ ఐఫోన్7కు ప్రత్యేకంగా నిలవడం లేదట. 2014లోనే డ్యూయల్ కెమెరాతో హెచ్టీసీ తన స్మార్ట్ఫోన్ ఎం8ను లాంచ్ చేసిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు చాలా స్మార్ట్ఫోన్లు డ్యూయల్ కెమెరాలతో లాంచ్ అయ్యాయని తెలిపారు. మరో విశేషమేమిటంటే రూ.10వేల ధరలోనే ఆ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయట. డ్యూయల్ కెమెరా సెట్అప్తో ఎక్కువ ప్రీమియం ఆఫర్ చేసే ఫోన్లు ఎల్జీ జీ5, హ్యువాయ్ పీ9లు ఐఫోన్7 ప్లస్కు సగం ధరలోనే మార్కెట్లో లభ్యమవుతుండటం విశేషం.
 
వాటర్ఫ్రూప్ డిజైన్ :
నీరు, దుమ్ము నుంచి పూర్తి రక్షణ కల్పించే విధంగా ఐపీ67 వాటర్ఫ్రూప్ ప్రమాణాల మేరకు ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్లను యాపిల్ లాంచ్ చేసింది. అయితే ఈ ఫీచర్ను కూడా నాలుగేళ్ల క్రితమే సోనీ తన ఎక్స్పీరియా జడ్ స్మార్ట్ఫోన్తో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిందట. స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ కూడా తక్కువ ధరలోనే తన ఎస్7, ఎస్7 ఎడ్జ్ ఫోన్లను విక్రయిస్తోందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు..
 
ఫ్రంట్ కెమెరాలో అధిక రెజుల్యూషన్ :
గతేడాదే ఐఫోన్6ఎస్/6ఎస్ ప్లస్ ఫోన్లలో 5 ఎంపీ సెన్సార్ను అప్గ్రేడ్ చేసిన యాపిల్, కొత్తగా లాంచ్చేసిన ఐఫోన్ 7 ఫోన్లలో 7ఎంపీ సెన్సార్ను అప్గ్రేడ్ చేసింది. కానీ రూ.15,000 సెగ్మెంట్లోనే 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫోన్లు వినియోగదారుల ముందు అలరిస్తున్నాయట. అయితే ఫ్రంట్ కెమెరా క్వాలిటీలో మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు, ఐఫోన్7కు సరితూగడం లేదని భావిస్తే, జియోని ఎస్6ఎస్, ఓపో ఎఫ్1లు ఫ్రంట్ కెమెరాలో అద్భుతమైన ఫలితాలను ప్రదర్శిస్తున్నాయని వారు వివరిస్తున్నారు. ఈ రెండు ఫోన్లు ఫ్రంట్ కెమెరా క్వాలిటీలో బెస్ట్ ఫోన్లన్ని ఇప్పటికే రుజువైందని స్పష్టంచేశారు. 
 
3.5 ఎంఎం జాక్ లేకపోవడం :
ఇక హెడ్ఫోన్స్ విషయానికొస్తే.. ఊహించినట్టుగానే 3.5ఎంఎం హెడ్జాక్ను యాపిల్ ఈ కొత్త ఫోన్లలో తొలగించింది. కానీ 3.5ఎంఎం కోరుకునే వారికోసం అడాప్టర్ను అందిస్తోంది యాపిల్. అదేవిధంగా వైర్లెస్ హెడ్ఫోన్స్ ఇందులో ప్లస్ పాయింట్ అని యాపిల్ చెబుతోంది. కానీ ఇవే ఫీచర్లను లీఇకో తన లీ2, లీమ్యాక్స్2 ఫోన్లను ఆఫర్ చేస్తోందని టెక్ విశ్లేషకుల వాదన. యూఎస్బీ టైప్-సీ పోర్టును లీఇకో కొన్ని నెలల క్రితమే అందుబాటులోకి తీసుకొచ్చిందని, లీఇకో ఆఫర్ చేస్తున్న ఈ అధిక క్వాలిటీ యూఎస్బీ టైప్-సీ హెడ్ఫోన్లనూ యాపిల్ కొత్త ఫోన్లకు జోడించడం ప్రత్యేకతేమి కాదంటున్నారు విశ్లేషకులు. 
 
స్టీరియో స్పీకర్స్ : 
మరో ఆండ్రాయిడ్ ఫీచర్ స్టీరియో స్పీకర్స్. తొలి సారిగా ఐఫోన్‌7లో స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేశారు. కొత్త ఫోన్లలోని స్టీరియో స్పీకర్లు ఉండడంతో సినిమా వీక్షణ అనుభవం సరికొత్తగా ఉండే అవకాశం ఉందని యాపిల్ హామి ఇస్తోంది.. అయితే ఇప్పటికే చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు చాలా ఏళ్ల నుంచే స్టీరియో స్పీకర్లను ఆఫర్ చేస్తున్నాయట. హెచ్టీసీ ఈ స్టీరియో స్పీకర్ల ట్రెండ్ను సృష్టించిందట. అనంతరం లెనోవా, మోటరోలా వంటి మిడ్ రేంజ్ ఫోన్లలో కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 
 
దీంతో స్మార్ట్ఫోన్ యూజర్లను ఎక్కువగా ఆకట్టుకునే ఈ ఫీచర్లన్నీ ఆండ్రాయిడ్ ఫోన్లలలో లభ్యమవుతున్నట్టు, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఫోన్7లో కొత్తమీ లేదని నిరాశ వ్యక్తంచేస్తున్నారు టెక్ విశ్లేషకులు. 
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement