మార్కెట్లోకి మోటో జీ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల విరామం అనంతరం మోటరోలా తమ కొత్త హ్యాండ్‌సెట్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 8 జీబీ వెర్షన్ ధరను రూ. 12,499గాను, అలాగే 16 జీబీ వెర్షన్ రేటును రూ. 13,999గాను నిర్ణయించింది. గురువారం నుంచి ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఇవి లభ్యమవుతాయని మోటరోలా మొబిలిటీ జీఎం మాగ్నస్ అల్‌క్విస్ట్ తెలిపారు.
అమెరికాలో టెలికం సంస్థలతో కాంట్రాక్టు లేకుండా 8జీబీ ఫోన్ 179 డాలర్లకు (దాదాపు రూ. 11,200), 16 జీబీ ఫోన్ 199 డాలర్లకు (సుమారు రూ. 12,400) లభిస్తోంది. మోటో-జీ లో 4.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, డ్యుయల్ సిమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్‌తో పనిచేసే వీటిని 4.4 కిట్‌క్యాట్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
నీరు చిందినా కూడా ఫోన్ పాడవకుండా ప్రత్యేకంగా కోర్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో మోటో జీని రూపొం దించారు. ఇతర ఫీచర్స్ విషయానికొస్తే.. ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 5 మెగాపిక్సెల్ కెమెరా, 1.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 50 జీబీమేర ఉచితంగా గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ మొదలైనవి ఉన్నాయి. 2012లో గూగుల్ చేతికి వెళ్లినప్పట్నుంచి మోటరోలా భారత్‌లో కొత్త ఉత్పత్తులేవీ ప్రవేశపెట్టలేదు.