
ఎమ్మెల్యే పదవికి తలసాని అసలు రాజీనామా చేయలేదు
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు.
హైదరాబాద్: తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే పదవికి తలసాని అసలు రాజీనామానే చేయలేదని మండిపడ్డారు. ఆర్టీఐ చట్టం కింద అసెంబ్లీ సచివాలయం ఈ వాస్తవాన్ని వెల్లడించిందని ఆయన తెలిపారు. తలసాని రాజీనామా లేఖ తమకు అందలేదంటూ స్పీకర్ కార్యాలయం ఇచ్చిన లేఖను సోమవారం రాష్ట్ర గవర్నర్కు సమర్పిస్తామన్నారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే తలసాని శ్రీనివాసయాదవ్ గవర్నర్, సీఎంకు చెప్పి మంత్రిగా ప్రమాణం చేసి... నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తక్షణమే గవర్నర్... కేసీఆర్ను పిలిపించి తలసానిచే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా రాజీనామా లేఖను స్పీకర్కు పంపాలని ఆయన తలసానికి సూచించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా తలసాని నిస్సిగ్గుగా రాజకీయ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. తనది ఆదర్శపాలన అని చెబుతున్న సీఎం కేసీఆర్.. తలసాని నిర్వాకంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్పీకర్, సీఎం, గవర్నర్ను మోసం చేసిన తలసానిపై డీజీపీ సుమోటోగా కేసు పెట్టాలని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.