గూగుల్ ఫోన్ల గ్రాండ్ లాంచింగ్!
గూగుల్ ఫోన్ల గ్రాండ్ లాంచింగ్!
Published Tue, Sep 20 2016 3:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
శాన్ఫ్రాన్సిస్కో : ఆండ్రాయిడ్ వెర్షన్లో తనదైన ముద్ర వేసుకున్న గూగుల్, స్మార్ట్ఫోన్ల మార్కెట్లోనూ తన క్రేజ్ను మరింత పెంచడానికి వచ్చేస్తోంది. సొంత బ్రాండుతో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు ముహుర్తం ఖరారు చేసుకుందట. అక్టోబర్ 4న గ్రాండ్ ఈవెంట్గా సొంత బ్రాండెడ్ ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయబోతుందని టెక్ విశ్లేషకులు టాక్. అక్టోబర్ 4న ఉదయం 9గంటలకు నిర్వహించబోయే ఈ ప్రత్యేక ఈవెంట్కు గూగుల్ ఆహ్వానాలు సైతం పంపించేసిందట. ఈ ఈవెంట్ టీజర్ వీడియోను గూగుల్, యూట్యూబ్లో కూడా పెట్టింది. అయితే కంపెనీ పిక్సెల్ ఫోన్ల విడుదలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
త్వరలోనే సొంత బ్రాండుతో స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి పెడతామన్న గూగుల్, ఈ ఈవెంట్లోనే వీటి లాంచింగ్ చేపడుతుందని అంచనాలు భారీగా పెరిగాయి. కొత్త ఫోన్లపై ప్రకటన మాత్రమే కాకుండా ఇతర గూగుల్ ఉత్పత్తుల గురించి వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఈ ఈవెంట్పై వినియోగదారుల్లో, టెక్ వర్గాల్లో ఫుల్ ఆసక్తి ఏర్పడింది. సెయిల్ ఫిష్, మార్జిన్ కోడ్ పేర్లతో రాబోతున్న ఈ ఫోన్లు 5, 5.5 అంగుళాల డిస్ప్లే ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ సాప్ట్వేర్లో ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన వెర్షన్ నోగట్తో ఈ ఫోన్లను లాంచ్ చేస్తుందని సమాచారం.
నెక్షస్ పేరుతో ఇంతకాలం భాగస్వామ్య కంపెనీల సహకారంతో గూగుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి ప్రవేశించనప్పటికీ.. ఎక్కడా గూగుల్ బ్రాండు కనిపించదు. దీంతో నెక్షస్ బ్రాండుతో కాకుండా తనకంటూ ఓ సొంత బ్రాండు, పిక్సెల్ పేరు మీద గూగుల్ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టేందుకు అన్ని సెట్ చేసుకుంది. యాపిల్కు ధీటుగా హై ఎండ్ టెక్నాలజీతో తన ఫోన్లను గూగుల్ తీసుకొస్తోందని మార్కెట్ వర్గాల టాక్. దీంతో ఇన్ని రోజులు శాంసంగ్ నుంచి ఎదుర్కొన్న పోటీ ప్రస్తుతం యాపిల్కు, గూగుల్ నుంచి కూడా ఎదురుకాబోతుంది. కాగ ఇటీవలే టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ 7 మోడల్స్ రెండింటిని శాన్ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహం సివిక్ వేదికగా గ్రాండ్గా ప్రవేశపెట్టింది.
Advertisement
Advertisement