పథకాలు ఓకే.. మరి అమలు ఎక్కడ ?
న్యూఢిల్లీ: సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన చిన్నారుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు అన్నీ భేషుగ్గా ఉన్నాయని, ప్రభుత్వం చెప్పేదానికి వాటి అమలుకు మాత్రం ఏమాత్రం పోలిక లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అమలు విషయంలో ఎందుకు విఫలం అవుతున్నారని చివాట్లు పెట్టింది.
'భారత ప్రభుత్వం చాలా గొప్ప చట్టాలను కలిగి ఉంది. ప్రభుత్వ పరంగా చేస్తున్న ఆలోచనలు బాగున్నాయి. అదే సమయంలో దేశంలో చిన్నారులను ఉద్దేశించిన పథకాలు బాగున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో వాటి అమలు చూస్తే మాత్రం పూర్తిగా వైఫల్యం చెందినట్లు కనిపిస్తోంది' అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మదన్ బీ లోకూర్ అన్నారు. బాలలకోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టిందని అంతకుముందు సుప్రీంకోర్టు ప్రశ్నించగా వాటి వివరాలను అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు అందజేశారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం పథకాలు బాగున్నాయని, కానీ వాటిని అమలు విషయం మాత్రం చెప్పలేని స్థితిలో ఉందని చెప్పారు.