క్యూ3 ఆర్థిక ఫలితాలపై దృష్టి.. | GST Council meet on Monday to try and bridge differences | Sakshi
Sakshi News home page

క్యూ3 ఆర్థిక ఫలితాలపై దృష్టి..

Published Mon, Jan 16 2017 2:12 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

క్యూ3 ఆర్థిక ఫలితాలపై దృష్టి..

క్యూ3 ఆర్థిక ఫలితాలపై దృష్టి..

బడ్జెట్‌ అంచనాలపైనా కూడా...
ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అభిప్రాయం


కంపెనీల మూడో త్రైమాసిక(క్యూ3) ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నాయి. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)కు సంబంధించిన అడ్డంకులను తొలగించడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు, బడ్జెట్‌ అంచనాలు కూడా స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పోకడ, ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల తీరు.. ఈ అంశాలన్నీ స్టాక్‌ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. నేడు(సోమవారం) వెలువడే డిసెంబర్‌ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుంది.

నేడే రిలయన్స్‌ ఫలితాలు
కేంద్ర బడ్జెట్‌పై అంచనాలు, కంపెనీల క్యూ3 ఫలితాలు, రానున్న బీఎస్‌ఈ ఐపీఓ.. మార్కెట్‌ను నడిపిస్తాయని ట్రేడ్‌ స్మార్ట్‌ ఆన్‌లైన్‌ డైరెక్టర్‌ విజయ్‌ సింఘానియా చెప్పారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(సోమవారం), యాక్సిస్‌  బ్యాంక్, అదానీ పవర్‌ తదితర బ్లూ చిప్‌ కంపెనీలు క్యూ3 ఫలితాలను ఈ వారంలోనే వెల్లడించనున్నాయి.

 పెద్ద కరెన్సీ నోట్ల రద్దు అనంతరం వెలువడే కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై స్టాక్‌ మార్కెట్‌ దృష్టి కేంద్రీకరిస్తుందని జైఫిన్‌  అడ్వైజర్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ దేవేంద్ర నేవ్‌గి చెప్పారు. వినియోగ, బ్యాంక్, సైక్లికల్‌ షేర్లపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏ మేరకు ఉందో ఈ క్యూ3 ఫలితాలు వెల్లడిస్తాయని పేర్కొన్నారు.

నవంబర్‌లో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండగా, డిసెంబర్‌లో మిశ్రమంగా ఉందని గణాంకాలు వివరిస్తున్నాయని చెప్పారు. రానున్న బడ్జెట్‌పై అంచనాలు బాగా పెరిగిపోయాయని, బడ్జెట్‌ అంచనాలు కూడా స్టాక్‌  మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వివరించారు.

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళిని ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తారని జియోజిత్‌ బీఎన్‌పీ పారిబా చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఆనంద్‌ జేమ్స్‌ చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో అమ్మకాలు కొనసాగిస్తున్నారని, ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ల్లో మాత్రం కొనుగోళ్లు జరుపుతున్నారని వివరించారు. సాంకేతికంగా చూస్తే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,460–8,520  స్థాయిలను పరీక్షిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌(రిటైల్‌ రీసెర్చ్‌) దీపక్‌ జసాని చెప్పారు. 8,382 పాయింట్ల వద్ద మద్దతు కోల్పోతే స్వల్పకాలికంగా బలహీనత ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

రూపాయిపై ఒత్తిడి..
రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(కరెన్సీ డెరివేటివ్స్‌) అనింద్య బెనర్జీ చెప్పారు. ఆర్‌బీఐ జోక్యం చేసుకోకపోవడం, విదేశీ నిధులు తరలిపోతుండడంతో డాలర్‌తో రూపాయి మారకం 67.70/90–69.40/50 రేంజ్‌లో కదలాడుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇక అంతర్జాతీయ అంశాలపరంగా చూస్తే, అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ పాలసీలపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది.

తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు
గత వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,104 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు. డెట్‌ మార్కెట్లతో కూడా కలుపుకొని వారి అమ్మకాలు రూ.2,685 కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్లో రూ.3,809 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. అయితే డెట్‌ మార్కెట్లో మాత్రం రూ.243 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద మన క్యాపిటల్‌  మార్కెట్‌ నుంచి ఈ నెల 13 వరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,566 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.  గత ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌ కాలానికి విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్ల నుంచి రూ.31,000 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించారు. ఇతర వర్థమాన దేశాలతో పోల్చితే భారత వృద్ధి అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని  బజాజ్‌ క్యాపిటల్‌ గ్రూప్‌ సీఈఓ అనిల్‌ చోప్రా చెప్పారు.

 ఈ ఏడాది చివరికల్లా 29 వేలకు  సెన్సెక్స్‌: బీఓఎఫ్‌ఏ  
ముంబై: ఈ ఏడాది చివరికల్లా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 29వేల పాయింట్లకు (ప్రస్తుతం 27,238 పాయిం ట్లు) చేరుతుందని బ్యాంక్‌  ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌(బీఓఎఫ్‌ఏ–ఎంఎల్‌) అంచనా వేస్తోంది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్‌టీ అంశాలపై అనిశ్చితి ఉన్నప్పటికీ, స్టాక్‌ మార్కెట్‌ మంచి రాబడులనే ఇస్తుందని పేర్కొంది. జీఎస్‌టీ ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చే అవకాశాల్లేవని తేల్చి చెప్పింది. జూలైలో అమల్లోకి రావచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోంది.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement