ఉగ్రవాదులతో హోరాహోరీ ఎదురుకాల్పులు!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు-భద్రతా దళాల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కుప్వారా జిల్లా ద్రుగ్‌ముల్లా గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు మాటువేశారన్న సమాచారంతో భద్రతాదళాలు, పోలీసులు రంగంలోకి దిగడంతో ఆదివారం ఉదయం 11 గంటలకు ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.
లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఇక్కడ మాటువేశారని, వారి వద్ద అధికస్థాయిలో ఆయుధాలున్నాయని సమాచారం అందుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఉగ్రవాదులను ఏరివేసేందుకు సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఆపరేషన్ కొనసాగిస్తున్నది. ఇప్పటివరకు ఎవరైనా చనిపోయారా? అన్నది తెలియరాలేదు. కానీ, ఉగ్రవాదులతో ఇప్పటికీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం అందుతోందని ఆర్మీ తెలిపింది. మరోవైపు సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో భారత సైన్యం దీటుగా సమాధానమిస్తోంది.