న్యూఢిల్లీ:ఈ నెల పది వరకు నగరంలోని ప్రధాన స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టికెట్ల విక్రయాలని నిలిపివేయాలని ఉత్తర రైల్వే గురువారం నిర్ణయించింది. దీపావళి, ఛట్‌పూజ పండుగల నేపథ్యంలో భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని అధికారులను ఆదేశించింది. వీటిలో న్యూఢిల్లీ, ఢిల్లీ, హజ్రాత్ నిజాముద్దీన్, ఢిల్లీ సరై రోహిల్లా, ఆనంద్ విహర్ టెర్మినల్ స్టేషన్లు ఉన్నాయని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అయితే వృద్ధులు, వికలాంగులు, ఆనారోగ్యం బారిన పడినవారు, ఒంటరిగా, పిల్లలతో కలిసి వెళుతున్న మహిళలను రైల్లోకి ఎక్కించేందుకు సహాయంగా వచ్చే వారి సంఖ్య వల్ల ప్లాట్‌ఫారమ్ టికెట్లకు డిమాండ్ పెరిగిందన్నారు.
అయితే స్టేషన్లలోని భారీ రద్దీని తప్పించడంతో పాటు ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకుండా ఉండేందుకు ఆ టికెట్ల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించామని వివరించారు.