ఎన్నికల్లో పోటీ చేయను: హార్థిక్
భోపాల్: రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే ప్రసక్తే లేదని పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్థిక్ పటేల్ స్పష్టం చేశారు. 'నాకు రాజకీయ లక్ష్యాలు లేవు. నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదు. నేను రైతులు, అట్టడుగు వర్గాల వారి హక్కుల కోసం పోరాడుతున్నాను. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను' అని హార్థిక్ విలేకరులతో తెలిపారు.
అలాగే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన స్ట్రాంగ్ లీడర్ శంకర్‌సిన్హా వాఘేలాతో కూడా చేతులు కలిపే అవకాశం లేదని హార్థిక్ కుండబద్దలు కొట్టారు. వాఘేలాతో ఇప్పటివరకు ఎలాంటి చర్చలు చేయలేదని చెప్పారు. అయితే, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చే విషయాన్ని ఆయన కొట్టిపారేయలేదు. గుజరాత్‌లో బలంగా ఉన్న పటేల్ సామాజికవర్గానికి రిజర్వేషన్ కల్పించాలంటూ 2015లో ఆందోళనలు నిర్వహించి హార్థిక్ పటేల్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.