పాప్ సింగర్ లేడీగాగా మతగురువు దలైలామాను కలిసినందుకు ఆమెను చైనా ప్రభుత్వం బహిష్కరించినట్లు వార్తలు ప్రసారం అయ్యాయి..
'స్టెఫని జానే ఏంజెలీనా గెర్మనొట్టా' అనే అసలు పేరు కంటే 'లేడీగాగా'గా ప్రపంచఖ్యాతి పొందిన పాప్ సింగర్ మరో వివాదాన్ని ఎదుర్కొంటోంది. గాయని, రచయిత్రి, నటిగానే కాక సామాజిక సేవలోనూ ముందున్న ఈ న్యూయార్క్ సంచలనం ఇటీవల ఓ అంతర్జాత సదస్సులో పాలుపంచుకుంది. 'దయాగుణం వల్ల కలిగే మేలులు' అనే అంశంపై జరిగిన ఆ సదస్సుకు టిబెట్ మతగురువు దలైలామా కూడా హాజరయ్యారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం కావడంతో లేడీగాగా.. దలైలామాతో ప్రత్యేకంగా భేటీ అయి, పలు అంశాలపై మాట్లాడింది. భేటీ అనంతరం లామాతో కలిసి దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే చైనా నెటిజన్లు ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డారు.
'మీ ఇద్దరిదీ బ్యాడ్ రొమాన్స్..' అని ఒకరంటే, 'నేను గాగాను ఆరాధించేవాణ్ని.. ఇకపై ఆమె అభిమానిగా ఉండదల్చుకోవట్లేదు' అని ఇంకొకరు.. 'అతన్ని కలిసి ఆమె తప్పుచేసింది' అని మరొకరు.. ఇలా లెక్కకు మిక్కిలి అసహన వ్యాఖ్యలు చేశారు. తాము భద్ధశత్రువుగా భావించే దలైలామాను లేడీగాగా కలుసుకోవడంపై అటు చైనా ప్రభుత్వం కూడా గుర్రుగా ఉన్నట్లు, గాయనిపై నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు స్థానిక మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. అమెరికా తర్వాత లేడీగాగాకు ఎక్కువమంది అభిమానులున్న దేశం చైనానే. కాగా, నిషేధం వార్తల్లో నిజం లేదని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి హాంగ్ లీ పేర్కొన్నారు. వీడియోల్లో అసభ్యకరమైన నృత్యాలు చేస్తోందంటూ లేడీగాగాపై చైనా గతంలో మూడేళ్ల నిషేధం విధించింది. 2014లో ఆ నిషేధాన్ని ఎత్తేసిన తర్వాత మళ్లీ అలాంటి వార్తలు రావడం ఇదే తొలిసారి. ఈ సంఘటనలపై ఆమె ఇంకా స్పందించలేదు.