హెచ్డీఎఫ్సీ బ్యాంక్...లాభం 20 శాతం అప్ | HDFC Bank Q1 net zooms 20% to Rs 3,239 cr | Sakshi
Sakshi News home page

హెచ్డీఎఫ్సీ బ్యాంక్...లాభం 20 శాతం అప్

Published Fri, Jul 22 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

హెచ్డీఎఫ్సీ బ్యాంక్...లాభం 20 శాతం అప్

హెచ్డీఎఫ్సీ బ్యాంక్...లాభం 20 శాతం అప్

రూ.19,323 కోట్లకు మొత్తం ఆదాయం
నికర వడ్డీ ఆదాయం 22 శాతం వృద్ధి
పెరుగుతున్న మొండి బకాయిలు
లాభాన్ని తగ్గించిన కేటాయింపుల భారం

ముంబై:  ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి.  ఈ ఆర్థిక సంవత్సరం  మొదటి క్వార్టర్లో బ్యాంక్ నికర లాభం 20 శాతం వృద్ధి చెంది రూ.3,239 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం, నిర్వహణ లాభం, నికర వడ్డీ ఆదాయం అంచనాలను మించి పెరగడం వల్ల ఈ స్థాయి నికర లాభం వచ్చిందని నిపుణులంటున్నారు. అయితే కేటాయింపులతో పాటు పన్ను భారం కూడా అధికంగా ఉండడం వల్ల నికర లాభం ఈ స్థాయికే పరిమితమైందని వారు పేర్కొన్నారు.

 మొత్తం ఆదాయం 17 శాతం అప్...
గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.16,503 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 17 శాతం వృద్ధి చెంది రూ.19,323 కోట్లకు పెరిగిందని బ్యాంక్ డిప్యూటీ ఎండీ, పరేశ్ సుక్తాంకర్ చెప్పారు.  ‘‘నికర ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.10,588 కోట్లకు పెరిగింది. ఫీజు, కమీషన్ల ఆదాయం రూ.1,713 కోట్ల నుంచి రూ.1,978 కోట్లకు పెరగ్గా... విదేశీ మారక, డెరివేటివ్‌ల ఆదాయం రూ.348 కోట్ల నుంచి రూ.315 కోట్లకు తగ్గింది. నికర ఆదాయంలో 71 శాతంగా ఉన్న నికర వడ్డీ ఆదాయం రూ.6,389 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.7,781 కోట్లకు, మొత్తం ఆదాయంలో 27 శాతం వాటా ఉన్న ఇతర  ఆదాయం 14 శాతం వృద్ధి చెంది రూ.2,807 కోట్లకు పెరిగాయి’’ అని సుక్తాంకర్ వివరించారు. రుణ వృద్ధి, పరిశ్రమ సగటుతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా పెరిగి 20 శాతానికి చేరిందన్నారు. నికర వడ్డీ మార్జిన్లు 4.3 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగాయి. డిపాజిట్లు 19 శాతం వృద్ధితో రూ.5,73,755 కోట్లకు, అడ్వాన్స్‌లు 23 శాతం వృద్ధి చెంది రూ.4,70,622 కోట్లకు చేరాయని చెప్పారాయన. మొత్తం బ్యాలెన్స్ షీట్ రూ.6,29,322 కోట్ల నుంచి రూ.7,55,100 కోట్లకు పెరిగింది.

నిబంధనలకు మించి సీఏఆర్!
గత క్యూ1లో రూ.728 కోట్లుగా ఉన్న కేటాయింపులు రూ.867 కోట్లకు పెరిగాయని సుక్తాంకర్ చెప్పారు. మొండి బకాయిలు పెరిగినప్పటికీ, బ్యాంక్‌కేమీ ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. పెరుగుతున్న మొండి బకాయిల్లో భారీ కార్పొరేట్ రుణాలేమీ లేవన్నారు. బాసెల్ త్రి మార్గదర్శకాల ప్రకారం, 9 శాతంగా ఉండాల్సిన క్యాపిటల్ అడెక్వసి రేషియో(సీఏఆర్) 15.5 శాతంగా ఉందని పేర్కొన్నారు.

మొండి బకాయిల సెగ...
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొన్నాళ్లుగా రిటైల్ రుణాలపైననే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. ఫలితంగా పరిశ్రమ వృద్ధి కంటే కూడా అత్యధికమైన వృద్ధిని సాధిస్తోంది. మరోవైపు ఇతర బ్యాంక్‌లతో పోలిస్తే ఈ బ్యాంక్ రుణ నాణ్యత కూడా బాగా మెరుగ్గా ఉంది. ఇలాంటి ప్రత్యేకతలున్న హెచ్‌డీఎఫ్‌సీకి ఇప్పుడు ఇతర బ్యాంకుల్లానే మొండి బకాయిల సెగ తగులుతోంది. స్థూల మొండి బకాయిలు 0.95 శాతం నుంచి 1.04 శాతానికి చేరాయి. నికర మొండి బకాయిలు మాత్రం ఫ్లాట్‌గా 0.3 శాతంగానే ఉన్నాయి తప్ప తగ్గలేదు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి(రూ.1,240)ను తాకింది. చివరకు  స్వల్ప నష్టంతో రూ.1,228 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement